చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు ముప్పై కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ హిస్టారికల్ డ్రామా. వీకెండ్ అయ్యేనాటికి యాభై లేదా అరవై మార్కు దాటడం సులభంగానే కనిపిస్తోంది. రితేష్ దేశముఖ్ టైటిల్ రోల్ పోషించిన రాజా శివాజీలో జెనీలియా, సంజయ్ దత్, విద్య బాలన్ తదితరులతో పాటు సల్మాన్ ఖాన్ చేసిన స్పెషల్ క్యామియో ప్రేక్షకులకు సర్ప్రైజ్ గా నిలిచింది. ఇక అసలు పాయింట్ కు వద్దాం.

రాజా శివాజీ కనక బలంగా కనెక్ట్ అయితే ఏకంగా చావానే టార్గెట్ చేయొచ్చని నిర్మాతలు భావించారు. కానీ అంత సీన్ లేదని అర్థమైపోతోంది. రాజా శివాజీకి మహారాష్ట్రలో దక్కుతున్న బ్రహ్మాండమైన ఆదరణతో పోలిస్తే ఇతర రాష్ట్రాల్లో తక్కువగానే ఉంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ ఏమంత అద్భుతాలు చేయడం లేదు. కలెక్షన్ స్టడీగా ఉన్నాయి కానీ మరీ వావ్ అనిపించుకోవడం లేదు. తెలుగుతో సహా ఇతర భాషల్లో డబ్బింగ్ చేసే రిస్క్ నిర్మాతలు తీసుకోలేదు.

అసలు కంటెంట్ లో ఏముందో చూద్దాం. రాజా శివాజీలో ఛత్రపతి జీవితాన్ని సంపూర్ణంగా చూపించలేదు. కొన్ని ముఖ్యమైన ఘట్టాలను మాత్రమే తీసుకున్నారు. బాల్యంలో సోదరుడు శంభాజీతో శివాజీకి ఉన్న అనుబంధం, హైందవ సామ్రాజ్యం కోసం పాటుపడిన వైనం, అఫ్జల్ ఖాన్ తో శివాజీ యుద్ధంని ప్రధానంగా వాడుకున్నారు. అయితే 3 గంటల 7 నిమిషాల నిడివి కావడంతో ల్యాగ్ అనిపిస్తుంది. రితేష్ దేశ్ ముఖ్ తనవరకు బెస్ట్ ఇచ్చినప్పటికీ విక్కీ కౌశల్ ని మ్యాచ్ చేయలేదు.

ఎలా చూసుకున్నా చావాలో సగం కూడా రాజా శివాజీ అందుకోవడం డౌట్ అంటున్నారు విశ్లేషకులు. అయితే పోటీ లేకపోవడం, గత రెండు మూడు వారాలుగా సరైన సినిమా రాకపోవడం ప్లస్ అవ్వొచ్చని మరో వర్గం అంచనా వేస్తోంది. ఒకవేళ సోమవారం నుంచి బుకింగ్ ట్రెండ్స్ కనక ఇంతే ఆశాజనకంగా ఉంటే సూపర్ హిట్ స్టేజి దాటిపోయి బ్లాక్ బస్టర్ అందుకోవచ్చు. క్లారిటీ రావాలంటే ఇంకో వారం రోజులు ఆగాల్సిందే. పూర్తిగా నిరాశపరచకపోవడం రాజా శివాజీకు అతి పెద్ద ప్లస్ పాయింట్.