సాయిపల్లవి మీద ట్రోలింగ్ అర్ధరహితం

ఇటీవలే జరిగిన ఏక్ దిన్ ఈవెంట్ లో సాయిపల్లవి హిందీలో ధారాళంగా మాట్లాడలేకపోవడాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోలింగ్ కంటెంట్ కోసం వాడుకుంటున్నారు. అమీర్ ఖాన్ నిర్మాతగా తీసిన మూవీలో నటించి ఈ మాత్రం భాష నేర్చుకోలేదా అంటూ తన మీద కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అయితే నాలుగు వేల కోట్లతో తీసిన రామాయణలో సీతగా ఎలా మేనేజ్ చేస్తారనే ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇదంతా అర్ధరహితం. ఎందుకో చూద్దాం.

హీరోయినే కాదు ఏ ఆర్టిస్టుకైనా భాషతో సంబంధం ఉండదు. తమ పెర్ఫార్మన్స్ కి అది ఎప్పటికీ అడ్డుగోడ కాదు. అదే నిజమైతే బాలీవుడ్ నుంచి ఎందరో హీరోయిన్లు ఇక్కడ గొప్ప అవకాశాలు దక్కించుకునే వాళ్ళు కాదు. ముప్పై సంవత్సరాల వెనుక మీనాక్షి శేషాద్రి నుంచి మొదలుపెట్టి ఇప్పటి దీపికా పదుకునే దాకా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. వీళ్లకు అక్షరం తెలుగు ముక్క రాదు. అయినా సరే బ్లాక్ బస్టర్స్ లో నటించారు. అభిమాన గణం సంపాదించుకున్నారు.

సో సాయిపల్లవి నటనని జడ్జ్ చేయాలంటే కేవలం హిందీనే ప్రామాణికంగా తీసుకోకూడదు. ఆ మాటకొస్తే ఏక్ దిన్ హీరో జునైద్ ఖాన్ మీద ఎక్కువ నెగటివిటీ ఉంది. అమీర్ ఖాన్ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఇతను ఇప్పటిదాకా బెస్ట్ అనిపించేవి ఇవ్వలేదు. ఇప్పుడీ మూవీలో కూడా ఎలా చేసుంటాడోననే అనుమానాలు జనాల్లో లేకపోలేదు. కేవలం స్టార్ కిడ్ అయిన కారణంగా తండ్రి పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు తీయిస్తూనే ఉన్నాడు.

కేరళకు చెందిన సాయిపల్లవికి తెలుగు మీద పట్టు ఒక్క సినిమాతో ఒక్క రోజుతో రాలేదు. చాలా రోజులు కష్టపడింది. ఇప్పుడు హిందీలోనూ అలాగే చేస్తుంది. ఇది ఆమెను సమర్ధించే ప్రయత్నం కాదు. దేనికైనా కొంత టైం పడుతుందనే వాస్తవాన్ని సదరు ట్రోలర్స్ అర్థం చేసుకోవాలి. అయినా అమీర్ ఖాన్ కన్నీళ్లకే విచిత్ర భాష్యాలు చెప్పినవాళ్లకు ఇలాంటివి ఎన్ని చెప్పినా వృథా ప్రయాసే. ఇదంతా ఎలా ఉన్నా మే 1 విడుదల కాబోతున్న ఏక్ దిన్ సాయిపల్లవికి ఎలాంటి డెబ్యూ అవుతుందో చూడాలి.