బిగ్ మోషన్.. నో బాస్….

నేను జంధ్యాల గారిని అభిమానించేవాడిని.. ఆహా నాపెళ్ళంట.. శ్రీవారికి ప్రేమలేఖ.. ముద్ద మందారం.. రెండు రెళ్ళు ఆరు.. ఇలా చాలా సినిమాలు…. ఆయన సినిమాలు ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు దగ్గరగా గమనించే వాడిని..

Evv సత్యనారాయణ ఆయన దగ్గర అసోసియేట్ గా పనిచేసేవాడు.. నేను డైరక్టర్ అయ్యాక నా ‘పట్టుకోండి చూద్దాం’ సినిమా రిలీస్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది.. 100డేస్ ఫంక్షన్ వరంగల్ లో ప్లాన్ చేసాము.. చీఫ్ గెస్ట్ గా జంధ్యాల గారిని పిలిస్తే బాగుంటుంది అని ఆయనను కలవడం డేట్ ఫిక్స్ చేసుకోవడం జరిగిపోయాయి..

నేను హీరో సురేష్.. బ్రమ్మి.. భరణి.. ధర్మవరపు.. బాబు మోహన్.. చలపతి రావు మిగతా టెక్నీషియన్స్ అందరం ఒక మినీ ac బస్ లో వెళ్లేలా ప్లాన్ చేసి.. జంధ్యాల గారికి ఒక కార్ సపరేట్ గా పెట్టాం.. ఈ విషయం తెలిసి ఆయన.. తనకు కార్ వద్దని మాతో పాటు బస్ లోనే ఎక్కారు..

వరంగల్ వెళ్లెవరకూ ఆయన జోకులు చెబుతూ అందర్నీ నవ్విస్తూ సరదాగా గడిపాము.. ఫంక్షన్ ఆరు గంటలకు మొదలైంది.. పబ్లిక్ విపరీతంగా వచ్చారు.. లోకల్ పొలిటీషియన్స్ కూడా గెస్టులు గా వచ్చారు.. జంధ్యాల గారి చేతుల మీదుగా నేను మెమెంటో తీసుకున్నాను.. తొమ్మిది గంటలకు ఫంక్టన్ అయిపోయింది.. తర్వాత పార్టీ.. హోటల్ లో ఆయన పక్కనే కూర్చున్నాను.. సార్.. మీరు రాసిన “గుండెలు మార్చబడును” నాటిక మా ఊర్లో వేసాము.. అందులో నేను గోవిందయ్య వేషం వేసాను అని చెప్పాను.. నాటిక మొత్తం ఒక ఎత్తు.. మల్లు క్యారక్టర్ ఒక ఎత్తు సార్ అని ఒకే డైలాగ్ తో ఆ వేషం సూపర్ గా పేలింది సార్ అని చెబితే ఆయన నవ్వి అది ఒక ఇంగ్లిష్ జోక్ లో నుంచి స్ఫూర్తి పొందాను అని చెప్పారు..

ఇప్పుడు నాటకం విషయానికి వస్తే ఒక డాక్టర్ ఒక ప్రయోగం లాగా మగ మనిషి గుండె ఆడమనిషికి.. చిన్న పిల్లవాడి గుండె ముసలివాడికి పెడతాడు.. నాటకం జరుగుతుండగా ఒక క్యారక్టర్ ‘మల్లు’అని స్టేజి మీదకు వస్తాడు.. చూడ్డానికి భయంకరంగా ఆరడుగుల పొడుగు.. గళ్ళ లుంగీ.. మెడ లో మఫ్లర్.. ముఖాన కత్తి గాటు.. ఇది అతని గెటప్.. డాక్టర్ అతనిని మీ దొర గారు ఎలా వున్నారు అని అడుగుతాడు.. అప్పుడు మల్లు.. “పెద్దదొర విరేచనం లేదు ” అంటాడు.. డాక్టర్ మందు ఇచ్చి పంపుతాడు.. స్టేజి మీదకి ఒక ముసలివాడు చిన్న పిల్లవాడిలా బందాడుతూ వస్తాడు.. విషయం ఏమిటంటే అతనికి ఒక చిన్న పిల్లవాడి గుండె పెట్టాడు డాక్టర్.. వాళ్ళతో మాట్లాడుతుండగా మల్లు మళ్ళీ ఎంట్రీ.. ఈసారి కోపంగా డాక్టర్ వంక చూస్తూ “పెద్ద దొర.. విరేచనం లేదు “… డాక్టర్ మళ్ళీ మందు ఇచ్చి పంపుతాడు… నాటకం మూడోవంతు అవుతుండగా మల్లు ఎంట్రీ.. డాక్టర్ ముఖం లో ముఖం పెట్టి “పెద్ద దొర.. విరేచనం లేదు” అంటాడు… “మీదొర కొండరాళ్ళు బండపెంకులు తిన్నాడా” అని అక్కడున్న మందులు అన్నీ ఒక కిరోసిన్ బాటిల్ లో పోసి మల్లుకిచ్చి ‘ఇది తాగమను.. సంచీ దులిపేసినట్టు అవుతుంది ” అని పంపిస్తాడు..

ఇంకో రెండు నిమిషాల్లో నాటకం ముగుస్తుంది అనగా మల్లు నీరసంగా దిగాలుగా వస్తాడు.. డాక్టర్ అతన్ని చూస్తాడు.. అప్పుడు మల్లు డైలాగ్.. “పెద్ద విరేచనం.. దొర లేడు ” అంటాడు.. ఇది జంధ్యాలగారికి గుర్తు చేసి.. అది సూపర్ సార్ అంటే.. అప్పుడు ఆయన ఇంగ్లేష్ జోక్ చెప్పారు.. “బిగ్ బాస్. నో మోషన్… బిగ్ మోషన్.. నో బాస్ “… మొన్న మా అమ్మాయికి us వీడియో కాల్ చెస్తే.. “నాన్నా.. బిగ్ బాస్ చూస్తున్నాం.. అయ్యాక కాల్ చేస్తాను అంది అప్పుడు జంధ్యాలగారు చెప్పిన జోక్ గుర్తొచ్చింది.. బిగ్ బాస్.. నో మోషన్… అదీ మ్యాటర్.

— శివ నాగేశ్వర రావు