థ్రిల్ల‌ర్ సినిమా కామెడీ మూవీ ఎలా అయింది?

ఒక క‌థ ఫ‌స్ట్ డ్రాఫ్ట్‌లో ఉన్న‌ట్లే.. మేకింగ్ టైంకి ఉండ‌కపోవ‌చ్చు. ఆ క‌థ‌కు మెరుగులు దిద్దే క్ర‌మంలో.. స‌ల‌హాలు సూచ‌న‌ల‌ను అనుస‌రించి.. మ‌ధ్య‌లో ర‌క‌ర‌కాల‌ మార్పులు చేర్పులు జ‌రుగుతుంటాయి. ఐతే ఇలాంటి మార్పులు ఎన్ని చేసినా.. సినిమా జాన‌ర్, టోన్ అయితే మారిపోదు. కానీ సీరియ‌స్ థ్రిల్ల‌ర్ తీద్దామ‌ని రాసిన‌ క‌థ కాస్తా.. కామెడీ ఫిలింగా మారిపోవ‌డం మాత్రం అరుదైన విష‌య‌మే. జెట్‌లీ సినిమా విష‌యంలో ఇదే జ‌రిగింద‌ట‌. ఇది ముందుగా ఒక స్టార్ హీరో కోసం త‌యారు చేసిన థ్రిల్ల‌ర్ క‌థ అని ఇటీవ‌ల ట్రైల‌ర్ లాంచ్‌లో నిర్మాత చెర్రీ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. 

మ‌రి స‌త్య‌తో కామెడీ సినిమాగా ఎలా మారిందో ద‌ర్శ‌కుడు రితేష్ రాణా ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. మ‌త్తు వ‌ద‌ల‌రా త‌ర్వాత స్టార్ హీరోతో థ్రిల్ల‌ర్ సినిమా తీద్దామ‌నే జెట్‌లీ క‌థ రాసిన‌ట్లు రితేష్ చెప్పాడు. ఐతే పూర్తి థ్రిల్ల‌ర్ అని కాకుండా కొంచెం హ్యూమ‌ర్ కూడా జోడించాల‌ని అనుకున్న‌ట్లు అత‌ను వెల్ల‌డించాడు.

ఈ క‌థ మొత్తం విమానంలోనే జరుగుతుంద‌ని, దీన్నొక ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా తీయాల‌ని భావించిన‌ట్లు చెప్పాడు. ఐతే ఈ క‌థ గురించి కొంద‌రితో మాట్లాడిన‌పుడు ఈ టైంలో ఇలాంటి ప్ర‌యోగం ఎందుకు అని వారించార‌ని, దీంతో తాను పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాన‌ని రితేష్ తెలిపాడు. అప్పుడే ఈ క‌థ‌ను కామెడీ ప్ర‌ధానంగా స‌త్య‌తో తీద్దామ‌నే ఆలోచ‌న చేశాన‌న్నాడు. 

మ‌త్తువ‌ద‌ల‌రా-2 చేశాక స‌త్య హీరోగా చేయ‌డానికి స‌రిప‌డా బ‌డ్జెట్, మార్కెట్ స‌మ‌కూరాయ‌ని.. స‌త్య‌కు త‌గ్గ‌ట్లుగా హీరో పాత్ర‌ను మార్చి, ఎక్కువ కామెడీ జోడించి ఈ క‌థ‌ను తీర్చిదిద్దామ‌ని.. అలా ఇంటెన్స్ థ్రిల్ల‌ర్ అనుకున్న సినిమా కాస్తా కామెడీ ఫిలింగా మారింద‌ని రితేష్ వెల్ల‌డించాడు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ లుక్‌ను టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్య నుంచి ఇన్‌స్పైర్ అయి తీర్చిదిద్దిన‌ట్లు రితేష్ చెప్ప‌డం విశేషం. జెట్‌లీ కార్మిక దినోత్స‌వ కానుక‌గా మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.