తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు హీరోగా జీవిత ఖైదీ, అడవిదొర లాంటి సినిమాలు నిర్మించారాయన. ప్రస్తుతం అప్పుడప్పుడు చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. పదేళ్ల ముందు ఆయన డబ్ చేసి రిలీజ్ చేసిన తమిళ చిత్రం బిచ్చగాడు ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఆ తర్వాత నేరుగా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసిన చదలవాడకు పెద్దగా కలిసి రాలేదు. ఐతే ఇప్పుడాయన రూ.30 కోట్ల పెట్టుబడితో పది చిన్న సినిమాలు తీయడానికి సిద్ధమయ్యారు.
ఇటీవలే కొత్తగా ఎన్నికైన దర్శకుల సంఘం కార్యవర్గంతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని వెల్లడించారు చదలవాడ. దర్శకుల సంఘంలో చాలామంది సరైన అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నారని.. అందులో ప్రతిభావంతులైన పది మందికి అవకాశం కల్పిస్తూ సినిమాలు నిర్మించాలని.. ఇందుకోసం రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వి.ఎన్.ఆదిత్య, సాయి రాజేష్ సహా పలువురు దర్శకుల సమక్షంలో ఆయన ప్రకటించారు.
ఎవరితో సినిమాలు తీయాలి.. ఎలాంటి చిత్రాలు నిర్మించాలి అనే విషయమై పరిశీలన జరిపేందుకు మాతృదేవోభవ దర్శకుడు అజయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చదలవాడ వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం సినీ నిర్మాణ పోకడల గురించి చదలవాడ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒకప్పుడు శోభన్ బాబుతో రూ.70 లక్షల ఖర్చుతో జీవిత ఖైదీ సినిమాను నిర్మించానని.. ఆ సినిమా ఫుల్ రన్లో రూ.7 కోట్ల షేర్ చేసిందని.. కానీ ఇప్పుడు నిర్మాతకు లాభాలు రావడం గగనంగా మారిందని ఆయన చెప్పారు. సినీ నిర్మాణ తీరే మారిపోయిందని.. బడ్జెట్లు పెరిగిపోయాయని.. నిర్మాత దారుణంగా దెబ్బతింటున్నాడని.. ఈ పరిస్థితుల్లో సినిమాల నిర్మాణం చాలా కష్టంగా మారిపోయిందని ఆయనన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates