మళ్ళీ వస్తామంటున్న ‘యువ’ జంట

టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ మ్యూజికల్ ఎంటర్ టైనర్ లో శ్రీహరి పాత్ర, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఎంత గొప్పగా కుదిరాయో రెండు మూడు మాటల్లో చెప్పలేం. అంతకు ముందు ఏడాదే సిద్దార్థ, త్రిష మణిరత్నం యువలో నటించినప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో గుర్తుండిపోయే లిస్టులో లేదు.

ఇదంతా ఇరవై సంవత్సరాల వెనుకటి మాట. మళ్ళీ ఈ జంటను తెరమీద చూడబోతున్నామని లేటెస్ట్ అప్డేట్. దిల్ రాజు నిర్మాణంలో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ షూటింగ్ మొత్తం దాదాపు విదేశాల్లో చేసేలా ప్లానింగ్ అయ్యిందట. సిద్దార్థ్, త్రిషతో పాటు మరో యంగ్ కపుల్ కూడా ఉంటుందని సమాచారం. అధికారికంగా త్వరలోనే ప్రకటించబోతున్నారు. త్రిష త్వరలోనే నటనకు స్వస్తి చెబుతుందని పుకార్లు వచ్చిన టైంలో ఈ లీక్ రావడం గమనార్హం.

ఇక వ్యక్తిగతంగా వెళ్తే సిద్దార్థ్ చాలా కాలంగా సరైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. చాలా కష్టపడి చేసిన టక్కర్, చిన్నా లాంటివి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. బొమ్మరిల్లు లాంటి క్లాసిక్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా సాధ్య పడటం లేదు. దాన్ని నిర్మించిన దిల్ రాజే ఇప్పుడీ కాంబోకి శ్రీకారం చుట్టడం గమనార్షం. తమిళంలో సమాంతరంగా తీస్తారా లేక డబ్బింగ్ తో మేనేజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

త్రిష విషయానికి వస్తే తను చిరంజీవి సరసన నటించిన విశ్వంభర రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తనవరకు షూటింగ్ పూర్తి చేసేసింది కాబట్టి ప్రమోషన్ల దాకా పెద్దగా పనుండదు. మోహన్ లాల్ తో ఓకే చేసుకున్న రామ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. బహుశా దీపావళి లేదా దసరాకు ఉండొచ్చని మల్లువుడ్ టాక్. మొత్తానికి సిద్దార్థ్, త్రిష రీ యూనియన్ వింటేజ్ యూత్ ఫ్యాన్స్ కి మంచి కిక్ అవుతుందని చెప్పడంలో డౌట్ లేదు. ఇంతకీ ఈ రెండో జంట ఎవరో మరి.