ట్రెండింగ్ ఉంది కానీ టికెట్ల స్పీడ్ పెరగాలి

నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో ఎవరికి వారు సక్సెస్ పట్ల తమ ధీమా వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టేసి ఆనందాన్ని పంచేసుకున్నారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఈ విషయంలో కొంచెం పై చేయి చూపిస్తుండగా టాక్స్, రివ్యూలు మిశ్రమంగా ఉన్నా ‘పాపం ప్రతాప్’ కూడా దానికి దగ్గరలోనే ఉండటం గమనించాల్సిన విషయం. ఈ రెండింటికి శని ఆదివారాలు చాలా కీలకం. ముఖ్యంగా మండుతున్న ఎండల దృష్ట్యా ఈవెనింగ్, నైట్ షోల ఆక్యుపెన్సీలు కీలకం కాబోతున్నాయి.

సరే ఇక ట్రెండింగ్ విషయానికి వద్దాం. బుక్ మై షోలో తిమ్మరాజుపల్లి గత ఇరవై నాలుగు గంటల్లో సుమారు 8 వేల 500 టికెట్ల దాకా అమ్మగా పాపం ప్రతాప్ ఇంతే వ్యవధిలో 6 వేల 720 టికెట్లు సేల్ చేసింది. అంటే రెండింటి మధ్య వ్యత్యాసం కేవలం 1780 టికెట్లు మాత్రమే. ఎలా చూసుకున్నా ఇవి చాలా తక్కువ నెంబర్లు. డెకాయిట్ పదో రోజు గంటకు 1100 టికెట్లు అమ్ముతుండగా దురంధర్ ది రివెంజ్ కౌంట్ 4 వేలకు పైగానే ఉంది. ఇది ఇప్పుడున్న వాస్తవ పరిస్థితి.

సో బడ్జెట్ లెక్కలు కాసేపు పక్కనపెడితే తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ రెండూ టికెట్ల స్పీడ్ పెంచాల్సిన అవసరం అయితే చాలా ఉంది. జనాలు ఆదరిస్తున్నారు, హౌస్ ఫుల్స్ పడుతున్నాయని చెబుతున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. హైదరాబాద్ మినహాయిస్తే కింది స్థాయి బిసి సెంటర్లలో ఈ రెండు చాలా స్లో పికప్ లో ఉన్నాయి. సోషల్ మీడియా మద్దతు బాగానే ఉన్నా కూడా తిమ్మరాజుపల్లి టీవీ నడక కాస్త నెమ్మదిగానే ఉంది.

ఇక ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ గురించి చెప్పాల్సిన పని లేదు. మార్నింగ్ షో నుంచే ఊసులో లేకుండా పోయింది. హాలీవుడ్ మూవీ ‘లీ క్రోనిన్స్ ది మమ్మీ’కి మల్టీప్లెక్సుల్లో ఆదరణ బాగానే ఉంది. భయంకరమైన హారర్ ని ఆ జానర్ ప్రేమికులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ సైతం నిదానమే ప్రధానం సూత్రంతో తెలుగు రాష్ట్రాల్లో స్లోగానే నడుస్తోంది. రేపు సండే అన్ని సినిమాలకు చాలా కీలకం. వీలైనంత రాబట్టుకుంటే సోమవారం డ్రాప్ ఎంత ఉన్నా టెన్షన్ పడాల్సిన పని ఉండదు.