గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆద్యంతం మంచి ఫీల్‌తో సాగే సినిమాలో కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులను కదిలించేస్తాయి. ప్రేమకథా చిత్రాల రూపురేఖలే మారిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి ప్యూర్ లవ్ స్టోరీ తీయడం అరుదు అంటే.. అది ప్రేక్షకులకు అంతగా నచ్చి బ్లాక్ బస్టర్ కావడం మరింత విశేషం.
గతంలో ‘ఆషిఖి-2’ లాంటి మరుపరాని చిత్రాన్ని అందించిన మోహిత్ సూరినే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. కొత్త హీరో హీరోయిన్లు అహాన్ పాండే, అనీత్ పడ్డా.. తమ పాత్రలకు అందులో ప్రాణం పోశారు. కొత్త జంట కావడం వల్ల ప్రేక్షకులకు చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించగా.. పెర్ఫామెన్స్ విషయంలో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. అందుకే ‘సైయారా’ ఒక క్లాసిక్‌గా నిలిచింది.
ఐతే ఇప్పుడు ‘సైయారా’ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా మోహిత్ సూరినే ఇంకో సినిమా చేస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ ‘సైయారా’ లాంటి మ్యాజిక్స్ ఎప్పుడో కానీ జరగవు. ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలనుకోవడం సాహసమే. ప్రేక్షకులు భారీ అంచనాలతో చూస్తారు. ప్రతిదీ ముందు వచ్చిన సినిమాతో పోల్చుకుని చూస్తారు. ఏమాత్రం అంచనాలకు తగ్గట్లు లేకపోయినా ఉస్సూరుమంటారు.
కాబట్టి ఇంత త్వరగా ‘సైయారా’ కాంబినేషన్ రిపీట్ చేయాలనుకోవడం చాలా రిస్కీనే. కాంబినేషన్ క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ రావచ్చు కానీ.. సినిమా తాము ఆశించినట్లుగా లేకపోతే ఫలితం తేడా కొట్టేస్తుంది. మరి ‘సైయారా’ కాంబోను క్యాష్ చేసుకుందామని సినిమా తీస్తున్నారా.. లేక నిజంగా ‘సైయారా’ మ్యాజిక్‌ను రిపీట్ చేయగలిగే స్థాయి కంటెంట్ వీళ్ల దగ్గర ఉందా అన్నది చూడాలి. త్వరలో చిత్రీకరణకు వెళ్లనున్న చిత్ర బృందం వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
