ఓజీ-2 ప‌నిలో సుజీత్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక‌, ఆయ‌న చేసిన చిత్రాల్లో అభిమానుల‌ను అత్యంత అల‌రించింది ఓజీనే. సినిమా అనౌన్స్ అయిన ద‌గ్గ‌ర్నుంచే బంప‌ర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా.. త‌ర్వాత ప్ర‌తి ప్రోమోతో ఆక‌ట్టుకుంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రులో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా.. ప‌వ‌న్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది.

అభిమానులు సినిమా నుంచి ఇంకా ఎక్కువే ఆశించారు కానీ.. ప‌వ‌న్ చేసిన మిగ‌తా చిత్రాల‌తో పోలిస్తే ఇది సూప‌ర్ అన‌డంలో మ‌రో మాట లేదు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ సురేంద‌ర్ రెడ్డితో సినిమాను ఓకే చేయ‌గా.. దాని కంటే ఓజీ సీక్వెల్ మీదే వారికి ఎక్కువ ఆశ‌లు, అంచ‌నాలు ఉన్నాయి.

ఓజీ-2 విష‌యంలో ఇటు సుజీత్, అటు ప‌వ‌న్ ఇద్ద‌రూ ఆస‌క్తితోనే ఉన్నారు కానీ.. అది ఎప్పుడు ఉంటుంద‌నే విష‌యంలో ఏ క్లారిటీ లేదు. ఐతే ఇటీవ‌ల దీని గురించి జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓజీకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేయాల‌ని సుజీత్ అనుకుంటున్నాడ‌ని.. ఆ దిశ‌గా చర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. పీపుల్ మీడియా సంస్థ‌, ప‌వ‌న్ సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ పీకే క్రియేటివ్ వ‌ర్క్స్ క‌లిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాయ‌ని తెలుస్తోంది. ఐతే ఈ సినిమా ఎప్పుడు ఉంటుంద‌నే విష‌యంలో మాత్రం క్లారిటీ లేదు. ఓజీ త‌ర్వాత సుజీత్.. నానితో బ్ల‌డీ రోమియో సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈపాటికే మొద‌లు కావాల్సింది.

కానీ ప్యార‌డైజ్ సినిమా అనుకున్న దాని కంటే ఆల‌స్యం అవుతుండ‌డంతో నాని ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. స‌మ్మ‌ర్ షూటింగ్ అంచ‌నాతో బ్ల‌డీ రోమియో స్క్రిప్టును సుజీత్ ఇప్ప‌టికే పూర్తి చేశాడు. ప్ర‌స్తుతం అత‌ను ఖాళీగా ఉన్నాడు.

ఈ స‌మ‌యాన్ని ఓజీ-2 కోసం వెచ్చిస్తున్నాడ‌ట సుజీత్. అభిమానుల అంచ‌నాల‌ను అందుకునేలా ఈ స్క్రిప్టును తీర్చిదిద్దే ప్ర‌య‌త్నంలో అత‌ను ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈసారి క‌థ ఎక్కువ‌గా జ‌పాన్ నేప‌థ్యంలోనే న‌డుస్తుంద‌ని.. సినిమాలో మిస్ అయిన టైం లైన్‌ను ఇందులో చూపిస్తార‌ని అంటున్నారు. సురేంద‌ర్ రెడ్డి చిత్రాన్ని పూర్తి చేశాక‌ వ‌చ్చే ఏడాది ఈ సినిమాను ప‌వ‌న్ మొద‌లుపెట్టే అవ‌కాశ‌ముంది.