వారణాసిని చుట్టుకున్న యుద్ధ మేఘాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీర రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న వారణాసి షూటింగ్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. అయితే ముందుగా చేసుకున్న ప్లానింగ్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగేందుకు వాతావరణం సహకరిస్తునట్టుగా లేదు. మిడిల్ ఈస్ట్ లో ఏర్పడ్డ యుద్ధం, అంతర్జాతీయ విపణిలో కనిపిస్తున్న అనిశ్చితి లాంటి కారణాలు జక్కన్న బృందాన్ని విదేశీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోకుండా అడ్డు పడుతున్నాయి. అందుకే ప్రస్తుతం హైదరాబాద్ లో కొనగిస్తున్నారు.

అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైన ఎపిసోడ్లను తీయబోతున్నారు. దేవరకు వాడిన సముద్రం సెట్ ని వారణాసి కోసం వినియోగిస్తున్నారనే వార్త నిన్నటి నుంచి తెగ తిరుగుతోంది. ఇది నిజమైనా టెన్షన్ లేదు. ఎందుకంటే ఎవరు వేసిన సెట్ అయినా తనదైన ముద్రతో ఒక కొత్త లుక్ తేవడంలో రాజమౌళిని మించిన వాళ్ళు లేరు. అందులోనూ పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడే జక్కన్న అన్నీ ముందస్తుగానే ప్లాన్ చేసుకుంటారు.

వారణాసిలోని కొన్ని కీలక సన్నివేశాలు అంటార్టికా, జార్జియా, కెన్యా తదితర దేశాల్లో ఇంకా తీయాల్సి ఉంది. కొన్ని గతంలోనే పూర్తి చేసుకుని వచ్చినా బాలన్స్ వి వేసవి తర్వాత ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని అయోమయంలో, ఒకవేళ పెద్ద షెడ్యూల్ ఏదైనా వేసుకుంటే అక్కడ ఇరుక్కుపోయే ప్రమాదాలను విశ్లేషించే పనిలో జక్కన్న బృందం బిజీగా ఉందట.

2027 ఏప్రిల్ విడుదలకు రెడీ అవుతున్న వారణాసి ఎట్టి పరిస్థితుల్లో డేట్ మిస్ కాకూడదని మహేష్ బాబు అభిమానులు కోరుకుంటున్నారు. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడే తత్వం లేని రాజమౌళి అవసరమైతే వాయిదా అయినా సరే అంటారేమో కానీ కాంప్రోమైజ్ ప్రసక్తే తీసుకురారు. ఇప్పటికైతే రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. డెడ్ లైన్ పెట్టుకుని దానికి అనుగుణంగానే వర్క్ చేస్తున్నారు. ఏదైనా అనూహ్యంగా జరిగితే తప్ప ఈ ప్లానింగ్ లో మార్పు ఉండదు.