ఈ మధ్య తెలుగు నిర్మాణ సంస్థలు ఇండస్ట్రీల మధ్య హద్దులను చెరిపివేస్తూ.. ఇతర భాషలకు వెళ్లి సినిమాలు నిర్మిస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇప్పటికే తమిళం, హిందీ భాషల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత మైత్రీ మూవీస్ అధినేతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని.. రాజును మించి దూకుడు చూపిస్తున్నారు.
ఈ సంస్థ గత ఏడాది తమిళం, హిందీ, మలయాళ భాషల్లో భారీ చిత్రాలు నిర్మించింది. తమిళంలో ఆ సంస్థ ప్రొడ్యూస్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్‌కు చాలా కాలం తర్వాత ఈ సినిమాతోనే కమర్షియల్ సక్సెస్ వచ్చింది. తమిళంలో ఎన్నో సంస్థలు తనతో సినిమా చేయడానికి లైన్లో ఉండగా.. మైత్రీ బేనర్లో ఈ సినిమా చేయడానికి అజిత్‌ను టెంప్ట్ చేసింది పారితోషకమే. ఈ సినిమాకు గాను అతడికి ఏకంగా రూ.165 కోట్ల పారితోషకం ఇచ్చింది మైత్రీ సంస్థ.
ఐతే ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. తర్వాతి సినిమాకు పారితోషకం పెంచేస్తుంటారు స్టార్ హీరోలు. నిర్మాతలే పోటీ పడి రెమ్యూనరేషన్లో హైక్ ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. ఐతే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీకి అందుకున్నది రికార్డు స్థాయి పారితోషకం కావడంతో… అదే మొత్తానికి తర్వాతి సినిమా చేయడానికి రెడీ అవగా, తనతో ప్రాజెక్టు ఓకే చేసిన తమిళ ప్రొడక్షన్ హౌస్ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ అందుకు ఒప్పుకోవట్లేదట.
గుడ్ బ్యాడ్ అగ్లీ తీసిన ఆధిక్ రవిచంద్రనే.. అజిత్ తర్వాతి సినిమాకు కూడా దర్శకత్వం వహించాల్సి ఉంది. ఇలాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో సినిమా అంటే అది ఏ నిర్మాణ సంస్థకైనా జాక్ పాటే అనుకుంటారు. ఐతే అజిత్‌కు రూ.165 కోట్లు ఇస్తే బడ్జెట్ హద్దులు దాటిపోతుందని.. డిజిటల్ మార్కెట్ కూడా డౌన్ అయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాపై పెట్టే బడ్జెట్‌తో బిజినెస్ వర్కవుట్ చేయడం కష్టమని ఏజీఎస్ భావిస్తోందట.
అందుకే ఈ సినిమా నుంచి వైదొలగడానికి ఆ సంస్థ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అజిత్ పారితోషకమైనా తగ్గించుకోవాలి.. లేదంటే అడిగినంత ఇచ్చే వేరే సంస్థలో అయినా సినిమా చేయాలి. ఈ కారణంతోనే ఈ మూవీ సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
