తమిళంలో నంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్‌తో సినిమా అంటే జాక్‌పాట్‌లా ఫీలవుతారు ఏ నిర్మాత అయినా. అందులోనూ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేసిన చివరి సినిమాను నిర్మించే అవకాశం అంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది. ఈ ఛాన్స్ దక్కించుకున్న కన్నడ నిర్మాత నారాయణను చూసి కోలీవుడ్ ప్రొడ్యూసర్లు అసూయ చెందే ఉంటారు. కానీ చివరికి చూస్తే.. ఈ సినిమాను ఎందుకు ప్రొడ్యూస్ చేశాన్రా నాయనా అని నారాయణ తల బాదుకునే పరిస్థితి వచ్చింది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక తమిళనాట ఎన్నికల తర్వాతే రిలీజ్ అనుకుంటుండగా.. ఈ సినిమా ఆన్ లైన్లో లీక్ అయిపోయింది. ఇప్పటికే చాలా నష్టం వాటిల్లగా.. తాజా పరిణామంతో నిర్మాత పూర్తిగా అన్యాయం అయిపోయిన పరిస్థితి. రూ.500 కోట్ల బిజినెస్ టార్గెట్ అనుకుంటే.. ఇప్పుడు సగానికి సగం కోత పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ఆలస్యం కావడం వల్ల పడ్డ వడ్డీల భారం ఒకవైపు.. ఇటు బయ్యర్లు, అటు ఓటీటీ, శాటిలైట్ సంస్థలు ముందు అనుకున్న రేటు కంటే బాగా తగ్గించబోతుండడం వల్ల జరిగే నష్టం ఇంకో వైపు. ఇలా నిర్మాత పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
‘జననాయగన్’ బడ్జెట్ రూ.400 కోట్లు కాగా.. అందులో సగం కంటే ఎక్కువ విజయ్ పారితోషకం కిందే పోయినట్లు సమాచారం. విజయ్‌కి అంత ఇచ్చినా సరే.. ఈ సినిమా ద్వారా నారాయణ వంద కోట్ల దాకా లాభం అందుకుంటాడని అంచనా వేశారు. కానీ ఇప్పుడు వంద కోట్లకు తక్కువ కాకుండా నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది.
ఒక సినిమా ద్వారా ఇంత లాస్ అంటే ఏ నిర్మాత అయినా ఎలా కోలుకుంటాడు? అందుకే విజయ్ ప్రొడ్యూసర్‌ను ఆదుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన పారితోషకంలో సగం, అంతకంటే ఎక్కువ ఆయన వెనక్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. విజయ్ ‘జననాయగన్’ను తన పొలిటికల్ ఐడియాలజీ చెప్పడానికి ఒక వేదికగా మలుచుకున్నాడు.
ఎన్నికల ముంగిట ఇది అతడి మాస్టర్ స్ట్రోక్ అనుకున్నారు. కానీ రాజకీయ అంశాలు ఉండడం వల్లే ఈ చిత్రానికి సెన్సార్ సమస్యలు తలెత్తాయి. కాబట్టి ఇప్పుడీ పరిస్థితికి బాధ్యత వహించాల్సింది విజయే. అందుకే అతను నిర్మాతను ఆదుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
విజయ్ సినిమాల్లో కొనసాగేట్లు ఉంటే నారాయణతో ఇంకో సినిమా చేయడానికి కూడా రెడీయే కానీ.. ప్రస్తుతానికి సినిమాలకు సెలవు అనే అంటున్నాడు. కాబట్టి పారితోషకం వెనక్కి ఇచ్చే అవకాశాలే ఎక్కువ. ఒకవేళ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాక మళ్లీ సినిమాలు చేయాలనుకుంటే మాత్రం రీఎంట్రీలో తొలి చిత్రాన్ని నారాయణకే చేసే అవకాశలున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
