ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున వార్నింగ్ సోషల్ మీడియాలో వచ్చింది. ఆ తర్వాత నిర్మాణ సంస్థ హెచ్చరిక చేసింది. విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కొన్ని వందల సంఖ్యలో ఉన్న లింకులు తీయించడంలో తమ వంతు కృషి చేశారు. తమిళనాడు నిర్మాతల మండలి ఈ ఘటనను ఖండిస్తూ సదరు ప్రొడ్యూసర్ కు సంఘీభావం తెలిపింది.

దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒక్కొకరుగా తమ గళం విప్పుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు సైతం బయటికి వచ్చి జన నాయగన్ ఎప్పుడు రిలీజ్ చేసినా ఎక్కువ స్క్రీన్లు ఇచ్చేలా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఎడిటర్స్ సంఘం విచారాన్ని వ్యక్తం చేస్తూ ఇది తమ విభాగంలో జరిగిన తప్పు కాదని, ఒకవేళ ఎడిటర్ అలా చేయాలని అనుకుంటే వాటర్ మార్క్ ఎందుకు వేసుకుంటాడని ప్రశ్నించడం కొత్త చర్చకు దారి తీసింది.

నిజానిజాలు పోలీసుల విచారణలో తెలుస్తాయి కానీ ఈలోగానే రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ముందైతే ఈ మూవీకి సెన్సార్ లాంఛనం అత్యవసరంగా పూర్తి చేయాలి. జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు కానీ ఏప్రిల్ 24 విడుదల చేసేందుకు అన్ని రకాలుగా కష్టపడాలి. ఇలా రోజుకో మీటింగ్ తో డ్యామేజ్ రిపేర్ చేయలేరు కానీ హైప్ తగ్గకుండా చూసుకోవాలి.

ఇదంతా ఎలా ఉన్నా అసలు నిందితులు దొరుకుతారా లేరా అనే దాని మీద అనుమానాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా పైరసీ చరిత్రలో పట్టుబడిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు. జన నాయకుడుతో సంబంధం లేకపోయినా ఇతర పైరసీ కేసుల్లో ఉన్న ఐబొమ్మ రవి సైతం బెయిలు మీద బయటికి వచ్చాడు. విజయ్ సినిమాని లీక్ చేసింది ఎవరైనా సరే వాళ్లకు కఠిన శిక్ష విధిస్తే తప్ప భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేయడానికి మిగిలినవాళ్లు భయపడతారు.