పవన్ నుంచి విజయ్ దాకా అందరూ బాధితులే

పైరసీ గురించి మరోసారి ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. సెన్సార్ వివాదం, తమిళనాడు ఎన్నికల వల్ల ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన జన నాయకుడు పూర్తి సినిమా హఠాత్తుగా ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా నిర్మాతలు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అప్పటికప్పుడు లింకులు తీయించడం, సైట్స్ బ్లాక్ చేయించడం, హ్యాండిల్స్ కి రిపోర్ట్ కొట్టడం లాంటి చాలా చేశారు కానీ పూర్తిగా కంట్రోల్ చేయలేనంత పెద్ద డ్యామేజ్ జరిగిపోయింది. ఇంకా జరుగుతూనే ఉంది.

ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది ఇప్పుడు మనం చూస్తున్న 5జీ టెక్నాలజీ లేని రోజుల్లోనే హెచ్డి ప్రింట్ లీకైపోయి ప్రొడ్యూసర్ గుండెల్లో బాంబు వేసింది. ఆయన అప్పటికప్పుడు నిర్ణయం మార్చుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సి వచ్చింది. కంటెంట్ లో దమ్ము ఉండటంతో రికార్డులు బద్దలైపోయాయి. ఇదే సమస్య విజయ్ దేవరకొండ టాక్సీవాలాకు వచ్చింది. ఎలాగోగా అతి కష్టం మీద నియంత్రించారు. సినిమా విజయం సాధించి హమ్మయ్య అనుకున్నారు.

ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ నుంచి విజయ్ దాకా అందరూ బాధితులే కనిపిస్తున్నారు కానీ అసలు నేరస్థులు ఎక్కడని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఐబొమ్మ రవిని పట్టుకున్న ఉదంతం ఇంకా పచ్చిగానే ఉంది. కానీ అతనొక్కడే ప్రపంచంలోని అన్ని పైరసీలు చేయడం లేదని జనాలకు తెలుసు. మరి తప్పు చేసిన వాళ్ళు విదేశాల్లో ఉండటం వల్ల తప్పించుకుంటున్నారా. వాళ్ళను పట్టుకునే శిక్షలు, చట్టాలు తీసుకురాలేమా అనేదే ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్న ప్రశ్న.

వీడియో క్యాసెట్లు, విసిడిలు, డివిడిలు, ఇంటర్నెట్ సైట్లు, టెలిగ్రామ్ యాప్ లో గ్రూపులు ఒకటా రెండా పైరసీ విస్తరణ పేరు మార్చుకుంటోంది తప్ప రూపం మాత్రం అంతకంతా పెరుగుతోంది. ఇన్ని దశాబ్దాల చరిత్రలో పైరసీకి పాల్పడి దొరికిపోయిన వాళ్ళను లెక్కేస్తే కేవలం సింగల్ డిజిట్ లో ఉంటారు. ఇప్పుడు జన నాయకుడు ఉదంతాన్ని హెచ్చరికగా తీసుకుని నిర్మాతలు, ప్రభుత్వాలు ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ అంతులేని పైరసీ కథలో ఎలాంటి మార్పు ఉండదు.