బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం, యూత్ మద్దతు ఎక్కువగా రాకాసకు కనిపించడం లాంటి కారణాలు కొంత ప్రభావితం చేశాయి. అయితే అనూహ్యంగా బైకర్ వీక్ డేస్ లో పికప్ అయ్యింది. గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షోలో బైకర్ సగటున 15 వేలకు పైగా టికెట్లు అమ్మగా రాకాస కొంచెం వెనుకబడి 13 వేల పైచిలుకు దగ్గర ఉంది. ఆదివారం దాకా ఇది రివర్స్ లో నడిచింది.

అయితే వీటిని బట్టి బైకర్ ఏదో బ్లాక్ బస్టర్ అయిపోతుందని వెంటనే తేల్చలేం. ఎందుకంటే ఇప్పుడీ పికప్ ని మరింతగా పెంచుకుని వచ్చే ఆదివారం దాకా స్పీడ్ కొనసాగించాలి. కానీ శుక్రవారం డెకాయిట్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, పళ్ళి చట్టంబి లాంటి కొత్త రిలీజులు ఉన్నాయి కాబట్టి వాటి ఎఫెక్ట్ ఎంత ఉంటుందనే దాన్ని బట్టి వసూళ్ల లెక్కలు ఉంటాయి. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బైకర్ ఫస్ట్ వీకెండ్ కి పద్దెనిమిది కోట్ల గ్రాస్ దాటేసింది.

ఇది నిజమైన పక్షంలో బ్రేక్ ఈవెన్ కి ఇంకా సగం దూరం పైనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అసాధ్యం కాదు కానీ బైకర్ కు వచ్చింది డీసెంటనే మాట మాత్రమే. సో కొంచెం గట్టి యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్ ప్రభావం కూడా గట్టిగానే ఉంది. ఇంకోవైపు రాకాస అనూహ్యంగా నెమ్మదించడం ఊహించనిది. టీమ్ ప్రమోషన్లు కొనసాగిస్తోంది. సిడెడ్ నుంచి సక్సెస్ టూర్ మొదలుపెట్టి అన్ని ప్రాంతాలకు వెళ్తోంది.

శర్వానంద్ చెప్పుకున్నట్టు బైకర్ తన పెర్ఫార్మన్స్ పరంగా కెరీర్ బెస్ట్ అవ్వోచ్చేమో కానీ కమర్షియల్ గా ఎంత మేర సేఫ్ అవుతుందనేది ఇంకో వారం ఆగాక క్లారిటి వస్తుంది. యువి క్రియేషన్ దీని మీద నలభై కోట్ల దాకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకుంది. అన్ని వర్గాల ఆడియెన్స్ మద్దతు దొరికితే ఇదేమి అసాధ్యం కాదు. కాకపోతే బిసి సెంటర్స్ లో స్లోగా ఉండటం, నెంబర్లు ఆశించినంత పెద్ద స్థాయిలో పెరగకపోవడం బైకర్ ఎదురుకుంటున్న చాలా పెద్ద సవాల్.