ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే ఉన్నాం. డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల విషయంలో హీరోయిన్లు ఎంత మొత్తుకుంటున్నా ఫలితం ఉండట్లేదు. ఈ ఇంటర్నెట్ మహా సముద్రంలో ఎవరు ఎవరినీ నియంత్రించలేని పరిస్థితి. కాబట్టి అమ్మాయిలు కూడా ఇలాంటి వాటిని మరీ సీరియస్‌గా తీసుకోకుండా ముందుకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఐతే ఇంటర్నెట్ ఇంత విస్తృతంగా లేనపుడు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు అంటే అమ్మాయిలు బెంబేలెత్తిపోయేవారు. హీరోయిన్లు సైతం అందుకు మినహాయింపు కాదు. తనకు కూడా అలాంటి అనుభవం ఉన్నట్లుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ వెల్లడించింది. తనకు 15 ఏళ్ల వయసున్నపుడు పో* వెబ్ సైట్లో తన మార్ఫింగ్ ఫొటో పెట్టేశారని.. అప్పుడు తాను చాలా కంగారు పడ్డానని ఆమె గుర్తు చేసుకుంది.
ఒక పాడ్ కాస్ట్‌లో జాన్వి మాట్లాడుతూ.. ‘‘దీన్ని డీప్ ఫేక్ అని అంటారో లేదో కూడా నాకు తెలియదు. నాకు 15 ఏళ్ల వయసుండగా ఒక ఘటన జరిగింది. ఒక పో* వెబ్ సైట్లో నా ఫొటోలు మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేశారు. నా క్లాస్ మేట్స్ వాటిని చూశామని చెప్పడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా టెన్షన్ పడ్డాను. దాని వల్ల ఎంతో డిస్టర్బ్ అయ్యాను.
సోషల్ మీడియాలో కనీసం నైతికత ఉండదని అప్పుడే అర్థమైంది. ఎవరో చేసిన ఇలాంటి పనుల వల్ల మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందే అని బాధ పడ్డాను. డీప్ ఫేక్ కారణంగా ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నా. దీని వల్ల నాకు ప్రశాంతత లేకండా పోయింది. కొన్ని ముఖ్యమైన న్యూస్ ఏజెన్సీలు కూడా నా ఏఐ ఫొటోలను ఒరిజినల్ అనుకుని వాడేస్తుంటాయి. ఇవి నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను దెబ్బ తీస్తాయి. దీని మీద గొంతు విప్పి బలంగా మాట్లాడాలని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ నాకు అంత వాయిస్ లేదు అనిపించి ఆగిపోతుంటా’’ అంటూ జాన్వి ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగులో ‘దేవర’ జాన్వి నటించిన ‘పెద్ది’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates