ఓ మంచి హిట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. ఒక దశలో తొలి ప్రేమ, ఎఫ్-2 లాంటి విజయాలతో మంచి ఊపు మీదa కనిపించిన అతను.. తర్వాత ట్రాక్ తప్పాడు. తన చివరి చిత్రం మట్కా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత అతను బాగా గ్యాప్ తీసుకుని కొరియన్ కనకరాజు చిత్రాన్ని లైన్లో పెట్టాడు.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందిస్తున్న ఈ చిత్రం చివరి దశలో ఉంది. దీని తర్వాతి సినిమాను వరుణ్ తాజాగా కన్ఫమ్ చేశాడు. ఈసారి వరుణ్ తన సోదరి నిహారిక ప్రొడక్షన్లో నటించబోతుండడం విశేషం. నటిగా కెరీర్ ముందుకు సాగకపోడంతో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తిన నిహారిక.. కమిటీ కుర్రోళ్లు చిత్రంతో నిర్మాతగా తన ప్రయాణాన్ని ఘనంగా మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె ప్రొడక్షన్లో తెరకెక్కిన రాకాస మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రాకాస రిలీజ్ కంటే ముందే నిహారిక నిర్మాతగా తన మూడో చిత్రాన్ని మొదలుపెడుతుండడం విశేషం. అందులో వరుణ్ హీరోగా నటించనుండగా.. కమిటీ కుర్రోళ్లుతో నిహారికకు నిర్మాతగా మంచి ఆరంభాన్ని అందించిన యదు వంశీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈసారి కూడా మంచి యూత్‌ఫుల్, ఫీల్ గుడ్ కథతో అతను సినిమా చేయబోతున్నాడట. దర్శకుడిగా తన రెండో సినిమా కథ పరిధి, బడ్జెట్ కూడా పెరుగుతున్నాయి.
శనివారమే ఈ సినిమా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు వరుణ్, నిహారికల బాబాయి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. వరుణ్ మార్కెట్ దెబ్బ తిన్న నేపథ్యంలో తన సినిమాకు పుష్ అవసరమైన నేపథ్యంలో పవన్ వస్తే అది బాగా ప్లస్ అవుతుంది.
ఐతే రేపు ఉదయం 11 గంటల నుంచి అమరావతిలో అసెంబ్లీ సమావేశాలకు పవన్ హాజరు కావాల్సిఉంది. వరుణ్ సినిమా ముహూర్తం ఉదయం 6.30కి పెట్టారు. విమాన ప్రయాణం అనుకూలిస్తే పవన్ ఈ వేడుకకు హాజరై.. అమరావతికి వెళ్తారు. లేదంటే ముహూర్తానికి రావడం అనుమానమే. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసులో నిలబెట్టాలనే ఆలోచనతోనూ ఉన్నారట. ఇప్పటికే సంక్రాంతి రష్ ఎక్కువైపోగా.. వరుణ్ సినిమాకు ఎక్కడ స్కోప్ ఉందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates