ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి రాబోతున్న అతి పెద్ద సినిమా.. రామాయణ. నిర్మాత చెబుతున్న ప్రకారం అయితే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రమిది. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా మీద ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించడం సంచలనం రేపింది. ఇప్పటిదాకా ( రిలీజ్ అయిపోయిన వాటిలో ) ఏ ఇండియన్ సినిమా మీదా వెయ్యి కోట్ల బడ్జెట్ కూడా పెట్టలేదు.
అలాంటిది ఒక్కో పార్ట్ మీద సగటున రూ.2 వేల కోట్ల ఖర్చు అంటే నమ్మశక్యం కాని విషయమే. ఐతే ఇండియన్ సినిమాకు అంత పొటెన్షియాలిటీ ఉందని.. ముఖ్యంగా రామాయణ గాథ మీద ఇంత బడ్జెట్ పెట్టడం రిస్కేమీ కాదనే నమ్మకంతో ఉన్నాడు నమిత్. ఐతే ఇంత రిస్క్ చేస్తున్న నిర్మాత మీద ఈ రోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. శ్రీరామనవమి సందర్భంగా రామాయణ అప్‌డేట్ ఇస్తూ అతను చేసిన ప్రకటనే అందుక్కారణం.
రామాయణ నుంచి ఏదైనా విశేషం పంచుకోవడానికి శ్రీరామనవమి కంటే మించిన సందర్భం ఏముంటుంది? కానీ ఈ రోజు గ్లింప్స్ లాంటిదేమీ రిలీజ్ చేయలేదు. కనీసం ఒక పోస్టర్ కూడా వదల్లేదు టీం. నమిత్ మీద ఆగ్రహానికి ఇది ఒక కారణం. కాకపోతే ఏప్రిల్ 2న హనుమజ్జయంతికి రాముడి గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించడం కాస్త ఊరట.
కానీ దీని గురించి నమిత్ పెట్టిన సోషల్ మీడియా పోస్టులో రామాయణ బై నమిత్ మల్హోత్రా అని హ్యాష్ ట్యాగ్ పెట్టాడు నమిత్. అంతే తప్ప ఎక్కడా దర్శకుడు నితీశ్ తివారి ప్రస్తావన లేదు. ఒక సినిమాకు దర్శకుడే అత్యంత కీలకం. సినిమా తీసేది అతనే కాబట్టి.. ఎ ఫిలిం బై అని వేసుకోవాల్సింది దర్శకుడే. కానీ ఈ నిర్మాత మాత్రం రామాయణ బై నమిత్ అని తన పేరును వేసుకోవడం మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మాతకు ఈ రోజుల్లో తగిన ప్రాధాన్యం లేకపోవడం గురించి తరచూ చర్చ జరుగుతుంటుంది. నిర్మాతకు కచ్చితంగా ప్రాధాన్యం పెరగాల్సిందే. అదే సమయంలో ఇలా దర్శకుడి ప్రాధాన్యం తగ్గించేసి.. నిర్మాత హైలైట్ అవ్వాలని చూడడం.. మొదట్నుంచి ఈ ప్రాజెక్టు విషయంలో పబ్లిసిటీ కోసం నమిత్ తెగ తాపత్రయ పడుతుండడం మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates