నాని దర్శకుడితో విజయ్ సినిమా చేస్తున్నాడా?

‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ రిలీజ్ టైమ్‌లో ‘ఇదే నా చివరి లవ్ స్టోరీ… ఇకపై ప్రేమకథా చిత్రాల్లో నటించను’ అంటూ ఫ్యాన్స్‌కి మాటిచ్చాడు విజయ్ దేవరకొండ. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ రిజల్ట్ రాబట్టడంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కొత్త కథల కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు విజయ్ దేవరకొండ. రొటీన్ లవ్ స్టోరీస్ జోలికి వెళ్లకుండా విభిన్నమైన కథలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఈ యూత్ స్టార్. అందులో భాగంగా ఓ క్రియేటివ్ డైరెక్టర్‌తో విజయ్ మూవీ కమిట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.

‘గ్రహణం’, ‘అష్టాచెమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘జెంటిల్‌మెన్’, ‘సమ్మోహనం’ వంటి విభిన్న చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ప్రస్తుతం నాని, సుధీర్‌బాబులతో ‘వీ’ చిత్రాన్ని తెరకెక్కించిన ఇంద్రగంటి, తన తర్వాతి సినిమాను విజయ్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంద్రగంటి మోహన్‌కృ‌ష్ణ చెప్పిన కాన్సెప్ట్‌కు తెగ ఇంప్రెస్ అయిన విజయ్ దేవరకొండ, వెంటనే సినిమాను ఓకే చేసినట్టు సమాచారం.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ, ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ‘ఫైటర్’ బాలీవుడ్‌లో హిట్టయినా, ఫట్టయినా కంటెంట్‌తో నడిచే ఇంద్రగంటి సినిమాతో అక్కడ మంచి క్రేజ్, మార్కెట్ సంపాదించుకోవచ్చని విజయ్ భావిస్తున్నట్టు టాక్. అయితే మధ్యలో దర్శకుడు శివ నిర్వాణతో ఒక సినిమా చేయాల్సి ఉంది.

మరో ప్రక్కన విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్ అంటూ కరోనా కష్టకాలంలో సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒక ప్రక్కన కొన్ని విమర్శులు వినిపిస్తున్నా కూడా, విజయ్ మాత్రం వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూపోతున్నాడు.