ధురంధర్ ‘దావూద్’.. తెరమరుగైన డాన్ అసలు కథ

ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ సినిమాలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత్రను చూపించిన విధానం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. సినిమాలో ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను మంచాన పడి ఉన్నట్లు చూపించిన విధానం ఆసక్తికరంగా ఉన్నా, వాస్తవ ప్రపంచంలో దావూద్ పరిస్థితి ఏంటనే ప్రశ్న మళ్ళీ మొదలైంది. గతంలో అతనిపై విష ప్రయోగం జరిగిందని, గ్యాంగ్రీన్ వ్యాధితో మంచాన పడ్డాడని రకరకాల వార్తలు వచ్చాయి. 

ఒకప్పుడు ముంబై వీధులను శాసించిన ఈ మాఫియా కింగ్, ఇప్పుడు పాకిస్థాన్‌లోని కరాచీలో ఐఎస్ఐ నీడలో అత్యంత రహస్యంగా బతుకుతున్నాడని టాక్. బయటి ప్రపంచానికి కనిపించి దశాబ్దాలు దాటిపోవడంతో, అసలు ఆయన బతికే ఉన్నాడా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

1955లో రత్నగిరిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టిన దావూద్, నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన తీరు ఎవరు ఊహించినిధి. చదువు మధ్యలోనే ఆపేసి హాజీ మస్తాన్ గ్యాంగ్‌లో చేరిన అతను, అనతి కాలంలోనే తన అన్న సబీర్ ఇబ్రహీంతో కలిసి ‘D కంపెనీ’ని స్థాపించాడు. 

ముంబైలో అప్పట్లో రాజ్యమేలుతున్న పఠాన్ గ్యాంగ్‌ను తుడిచిపెట్టి అండర్ వరల్డ్ డాన్‌గా ఎదిగాడు. స్మగ్లింగ్, దోపిడీలతో మొదలైన అతని ప్రస్థానం 1993 ముంబై పేలుళ్లతో దేశద్రోహిగా మారింది. 257 మంది ప్రాణాలు బలిగొన్న ఆ రక్తపాతం తర్వాత భారత్ నుండి పరారైన దావూద్, దుబాయ్ మీదుగా పాకిస్థాన్ చేరుకుని అక్కడే ఆశ్రయం పొందుతున్నాడు. దావూద్ కేవలం ఒక గ్యాంగ్‌స్టర్ మాత్రమే కాదు, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న అంతర్జాతీయ ఉగ్రవాది.

భారత్ ఎప్పటికప్పుడు అతని ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూనే ఉంది. 2026 మార్చి నాటికి కూడా మహారాష్ట్రలోని అతని పూర్వీకుల ఆస్తులను ప్రభుత్వం వేలం వేసింది. పాకిస్థాన్‌లోని క్లిఫ్టన్ ప్రాంతంలో హై సెక్యూరిటీ మధ్య తలదాచుకుంటున్న దావూద్, ఇప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో (డయాబెటిస్, గ్యాంగ్రీన్) సతమతమవుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఒకప్పుడు ప్రపంచాన్ని భయపెట్టిన వ్యక్తి ఇప్పుడు బయటకు రావడానికి కూడా భయపడే స్థితిలో ఉన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుక్కి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన సమయంలోనే ప్రపంచం అతన్ని చివరిసారిగా చూసింది. అప్పటి నుండి దావూద్ కదలికలు పూర్తిగా రహస్యంగా మారిపోయాయి. అండర్ వరల్డ్ డాన్ ఇప్పటికీ అండర్ గ్రౌండ్ లోనే ఉండిపోవడానికి కారణం భారత దర్యాప్తు సంస్థల హిట్ లిస్ట్ లో అతను నంబర్ 1 గా ఉండటమే.

నకిలీ నోట్ల ముద్రణ, డ్రగ్స్ మాఫియాతో తన సామ్రాజ్యాన్ని నడుపుతున్నా, తన రక్షణ కోసం పాకిస్థాన్ సైన్యంపైనే ఆధారపడాల్సి వస్తోంది. సినిమాల్లో చూపించే కథలు ఎన్ని ఉన్నా, నిజ జీవితంలో దావూద్ ఇబ్రహీం ఒక అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయాడు. భారత్ తన దౌత్య పోరాటాన్ని ఆపకుండా, పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తూనే ఉంది. దావూద్ ఉన్నాడనే విషయాన్ని పాక్ అంగీకరించకపోయినా, అంతర్జాతీయ నివేదికలు మాత్రం ఆధారాలతో సహా నిరూపిస్తున్నాయి.