వారణాసికి డిస్కౌంట్ ఇచ్చిన రాజమౌళి

సెట్లు, షూటింగ్ స్పాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని వాటి వివరాలు, ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్తపడే రాజమౌళి ఈసారి వారణాసికి మినహాయింపు ఇచ్చినట్టు కనిపిస్తోంది. హైదరాబాద్ లో వేసిన కాశి సెట్ కు సంబంధించిన వీడియోలు, ఇమేజులు, మినియేచర్లు, ఆర్ట్ వర్క్ స్కెచ్చులు అన్నీ హాలీవుడ్ మీడియా ద్వారా బయటికి రావడంతో ఒక్కసారిగా ఎక్స్, ఇన్స్ టాలు వాటితో మారుమ్రోగుతున్నాయి ఎక్కడ చూసినా ఈ పిక్స్ హడావిడే కనిపిస్తోంది.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ కు అంత స్ట్రిక్ట్ గా ఉన్న జక్కన్న ఇప్పుడు వారణాసికి మాత్రం డిస్కౌంట్ ఎందుకు ఇచ్చారనే ప్రశ్న ఫ్యాన్స్ తో పాటు అందరిలోనూ మెదులుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఈ మూవీని ప్యాన్ ఇండియా స్థాయిలో కాదు ప్యాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చేయాలనేది రాజమౌళి ప్లాన్. దానికి తగ్గట్టే విదేశీ మీడియాను ఆకట్టుకుని తద్వారా ఫారిన్ నిర్మాతలు, స్టూడియోలు, డిస్ట్రిబ్యూటర్ల దృష్టిలో పడేందుకు పక్కా ప్రణాళికతో ఉన్నారు. అందుకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు.

తెలియకుండా, ఏమరుపాటుగా రాజమౌళి ఏదీ చేయరు. ప్రతి పని వెనుక లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఇప్పుడు వారణాసికి కూడా అదే ఫాలో అవుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 విడుదల కాబోతున్న వారణాసికి ఏడాది ముందు నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఇప్పుడు బయటికి వదిలిన కంటెంట్ అందులో భాగంగా వచ్చిందే. ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి. నిజంగా కాశిలో ఉన్నామా అనిపించేలా అద్భుతంగా చేయించిన సెట్లకు మతులు పోవడం ఖాయం.

వరల్డ్ మొత్తం ఈ మూవీ గురించి మాట్లాడుకునేలా చేయడమే రాజమౌళి లక్ష్యంగా పెట్టుకున్నారని టీమ్ నుంచి వినిపిస్తున్న టాక్. అందుకే మహేష్ బాబు సైతం మూడు సంవత్సరాల కాలాన్ని దీని కోసం కేటాయించారు. ప్రస్తుతం మహేష్, ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ తదితరులు పాల్గొన్న కీలక భాగాలు షూట్ చేస్తున్న రాజమౌళి ఆగస్ట్ లోగా షూట్ ఫినిష్ చేసి ఎక్కువ సమయం పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ల కోసం అట్టిపెట్టుకోబోతున్నారు. రిలీజ్ డేట్ అయితే మిస్సయ్యే ఛాన్స్ లేదట.