ఆదిత్య ధార్ కొత్త సినిమా ఎవరితో

కనివిని ఎరుగని రీతిలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న దురంధర్ ది రివెంజ్ దర్శకుడు ఆదిత్య ధార్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే దాని మీద ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితర ట్వీట్లకు స్పందించాడు కాబట్టి వాళ్లలో ఒకరితో ఖచ్చితంగా ఉంటుందనే ఊహాగానాలు అభిమానుల్లో బయలుదేరాయి. ఎవరికి వారు దీని మీద సోషల్ మీడియాలో లెక్కలు, విశ్లేషణలు చేసుకున్నారు కూడా.

అయితే ముంబై కథనాల ప్రకారం ఆదిత్య ధార్ ఇంకా ఏ హీరోకు కమిట్ కాలేదు. గతంలో తాను వద్దనుకున్న ఇమ్మోర్టల్స్ అఫ్ అశ్వద్ధామని ఇప్పుడు ఎంత బడ్జెట్ అయినా సరే తాము పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పలు నిర్మాణ సంస్థలు ఆదిత్య ధార్ ని సంప్రదించాయట. కానీ దీనికి మల్టీస్టారర్ క్యాస్టింగ్ అవసరం. ఎంతలేదన్నా వారణాసిని మించిన బడ్జెట్ అంటే రెండు వేల కోట్ల దాకా అవ్వొచ్చని అంటున్నారు. కానీ మార్కెట్ పరంగా పెద్ద రిస్క్ అవుతుంది.

ఇప్పటికైతే ఆదిత్య ధార్ సక్సెస్ ని ఎంజాయ్ చేసే మూడ్ లో ఉన్నాడు. తన డెబ్యూ మూవీ యురి, ఇప్పుడు దురంధర్ రెండు భాగాలు భారతీయతను బాగా హైలైట్ చేసినవి. మన జోలికి వస్తే అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించినవి. తర్వాత చేయబోయే మూవీకి కూడా ధార్ ఇలాంటి సెటప్పే రాసుకున్నాడని వినికిడి. షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ లాంటి సీనియర్లతో కాకుండా ఇప్పటి జనరేషన్ హీరోలతోనే చేసేందుకు మొగ్గు చూపుతున్నాడని సమాచారం.

అనౌన్స్ మెంట్ ఎప్పుడు వచ్చినా ఎవరితో చేతులు కలిపినా అదో సెన్సేషన్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఇప్పటికే పలు ఓటిటి సంస్థలు ఆదిత్య ధార్ తర్వాతి ప్రాజెక్టు ఎవరితో చేస్తాడు, దాని ప్రొడక్షన్ హౌస్ ఏంటి, ఎంత మొత్తం ఆఫర్ చేయొచ్చనే దాని మీద కసరత్తులు చేస్తున్నాయట. రెండు మూడు ఈవెంట్లలో కనిపించడం తప్ప మీడియాకు ఇంటర్వ్యూలు సైతం ఇవ్వకుండా ప్రచారాలకు దూరంగా ఉన్న ఆదిత్య ధార్ శుభవార్త ఎప్పుడు చెబుతాడో చూడాలి.