గాడ్ ఆఫ్ వార్.. త‌మ‌న్‌దేనా?

గాడ్ ఆఫ్ వార్.. ఇప్ప‌టిదాకా ఫ్యామిలీ, యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్లే తీస్తూ వ‌చ్చిన అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో, భారీ బ‌డ్జెట్లో చేయాల‌నుకుంటున్న మైథాల‌జీ ఫిలిం. ఇండియ‌న్ సినిమాలో పెద్ద‌గా ట‌చ్ చేయ‌ని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి మీద ఫుల్ లెంత్ సినిమా చేయాల‌న్న‌ది త్రివిక్ర‌మ్ ఆలోచ‌న‌. ఇందుకోసం ఆయ‌న ఎప్పుడో స్క్రిప్టు రెడీ చేశాడు. భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ సిద్ధంగా ఉంది కూడా.

కానీ ఇందులో లీడ్ రోల్ చేసేదెవ‌రు అనే విష‌యంలో సందిగ్ధ‌త వ‌ల్ల ఈ ప్రాజెక్టు ఆల‌స్య‌మైంది. ముందు అల్లు అర్జున్ అన్నారు. త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఆపై మ‌ళ్లీ బ‌న్నీ పేరు వినిపించింది. ప్ర‌స్తుతానికి ఈ ఇద్ద‌రు హీరోలూ వేర్వేరు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. త్రివిక్ర‌మేమో.. విక్ట‌రీ వెంక‌టేష్‌తో ఆద‌ర్శ‌కుటుంబం మూవీ తీస్తున్నాడు. అది అయ్యాక హీరోను ఖ‌రారు చేసి సినిమాను ప‌ట్టాలెక్కించే అవ‌కాశ‌ముంది.

ఈ చిత్రానికి హీరో ఎవ‌ర‌న్న‌ది ఎప్పుడు తేలుతుందో కానీ.. సంగీత ద‌ర్శ‌కుడిగా మాత్రం త‌మ‌న్ ఫిక్స్ అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో త‌మ‌న్ మాట‌ల్ని బ‌ట్టి చూస్తే అదే నిజ‌మయ్యేలా ఉంది. అర‌వింద స‌మేత ద‌గ్గ‌ర్నుంచి త‌మ‌న్ వ‌రుస‌గా త్రివిక్ర‌మ్ సినిమాల‌కు సంగీతం అందిస్తున్నాడు. కానీ ఆద‌ర్శ కుటుంబంతో ఈ కాంబినేష‌న్ బ్రేక్ అయింది.

ఈ మూవీకి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మార్పు గురించి ఒక ఇంట‌ర్వ్యూలో అడిగితే.. ఇది ఉద్దేశ‌పూర్వ‌కంగా తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని త‌మ‌న్ వెల్ల‌డించాడు. ఆద‌ర్శ కుటుంబం సినిమాకు పూర్తిగా ఒక కొత్త టీం ఉండాల‌ని భావించి త్రివిక్ర‌మ్.. దానికి కొత్త టెక్నీషియ‌న్ల‌కు అవ‌కాశ‌మిచ్చాడ‌న్నాడు.

త‌మ కాంబినేష‌న్‌కు వ‌చ్చిన ఢోకా ఏమీ లేద‌ని.. దీని త‌ర్వాత త్రివిక్ర‌మ్ తీయ‌బోయే భారీ చిత్రానికి తానే సంగీతం అందిస్తాన‌ని.. దాని స్కేల్ వేరుగా ఉంటుంద‌ని త‌మ‌న్ తెలిపాడు. త్రివిక్ర‌మ్, తాను త‌ర‌చుగా క‌లుస్తూనే ఉంటామ‌ని.. మాట్లాడుకుంటుంటామ‌ని అత‌ను చెప్పాడు. త‌మ‌న్ మాట‌ల్ని బ‌ట్టి చూస్తే ఆ భారీ చిత్రం గాడ్ ఆఫ్ వార్‌యే అయి ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.