నెట్ ఫ్లిక్స్.. తెలుగు ద‌ర్శ‌కుల‌ను కాద‌ని

ఆన్ లైన్ స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ఇండియాలో కొన్నేళ్ల నుంచి వెబ్ సిరీస్‌లు రూపొందిస్తోంది. హిందీలో చాలానే సిరీస్‌లు నిర్మించింది. త‌మిళ ప‌రిశ్ర‌మ నుంచి ప్ర‌ముఖ ఫిలిం మేక‌ర్లు నెట్ ఫ్లిక్స్‌కు కంటెంట్ చేసి ఇచ్చారు. కానీ తెలుగులో మాత్రం నెట్ ఫ్లిక్స్ ఇప్ప‌టిదాకా ఒక్క సిరీస్ కూడా రూపొందించ‌లేదు. ఇక్క‌డి నుంచి సినిమాలు కూడా ఈ మ‌ధ్యనే కొంటోంది.

వెబ్ సిరీస్‌ల కోసం కొన్నేళ్ల ముందు నుంచే స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి కానీ.. ఏదీ ఇంకా వ‌ర్క‌వుట్ కాలేదు. ల‌స్ట్ స్టోరీస్ తెలుగు వెర్ష‌న్ల త‌యారీ గ‌త ఏడాదే మొద‌లైంది. కానీ అవి ఎంత వ‌ర‌కు వ‌చ్చాయో తెలియ‌డం లేదు. ఇక బాహుబ‌లికి కొన‌సాగింపుగా వెబ్ సిరీస్ గురించి రెండు మూడేళ్ల ముందే నెట్ ఫ్లిక్స్ స‌న్నాహాలు మొద‌లుపెట్టింది. కానీ అది ఎంత‌కూ ఓ కొలిక్కి రాలేదు.

దేవా క‌ట్టా, ప్ర‌వీణ్ స‌త్తారు ఈ ప్రాజెక్టు మీద కొంత కాలం ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. ఐతే వారి ప‌నితీరు నెట్ ఫ్లిక్స్ వాళ్ల‌కు సంతృప్తి క‌రంగా అనిపించ‌లేదో ఏమో ప‌క్క‌న పెట్టేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టే ఆపేశారేమో అనుకుంటే.. అలాంటిదేమీ లేద‌న్న‌ది తాజా స‌మాచారం. ఇప్పుడు ఓ కొత్త ద‌ర్శ‌కుడిని ఈ మెగా ప్రాజెక్టు కోసం ఎంచుకున్నారు.

అత‌డి పేరు.. విశ్వేష్ కృష్ణ‌మూర్తి. త‌మిళుడైన ఈ యంగ్ డైరెక్ట‌ర్.. ఏఆర్ రెహ‌మాన్ క‌ల‌ల ప్రాజెక్టు 99 సాంగ్స్‌తో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేయ‌నున్నాడు. ఈ సినిమా మేకింగ్ ద‌శ‌లో ఉంది. ఇంకా విడుద‌ల కాలేదు. ఈలోపే విశ్వేష్ ప్ర‌తిభ గురించి తెలిసిన నెట్ ఫ్లిక్స్ ప్ర‌తినిధులు.. అత‌డికి బాహుబ‌లి సిరీస్ బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ట‌. మ‌రి ఈ మెగా ప్రాజెక్టును అత‌నెలా డీల్ చేస్తాడో చూడాలి.