అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు చిరు అడ్వాన్స్

అమ్మ రాజ‌శేఖ‌ర్ డ్యాన్స్ మాస్ట‌ర్‌గా చేసిన సినిమాలు త‌క్కువే. మ‌ధ్య‌లోనే నృత్య ద‌ర్శ‌క‌త్వాన్ని ప‌క్క‌న పెట్టేసి డైరెక్ష‌న్ వైపు వెళ్లిపోయాడు. లారెన్స్, ప్ర‌భుదేవా.. ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు డ్యాన్స్ డైరెక్ట‌ర్లు అవుతున్న స‌మ‌యంలోనే రాజ‌శేఖ‌ర్ సైతం అటు వైపు అడుగులేశాడు. గోపీచంద్ హీరోగా అత‌ను తీసిన తొలి సినిమా ర‌ణం అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ట‌యింది. రాజ‌శేఖ‌ర్‌కు ద‌ర్శ‌కుడిగా మంచి పేరే వ‌చ్చింది. కానీ ఆ త‌ర్వాత అత‌ను అంచ‌నాలు అందుకోలేక‌పోయాడు.

ఓ హిందీ సినిమాను కాపీ కొట్టి ర‌వితేజతో తీసిన ఖ‌త‌ర్నాక్ పెద్ద డిజాస్ట‌ర్ అయింది. ఆ త‌ర్వాత అత‌ను చేసిన సినిమాల‌న్నీ ఫ్లాపులే. ద‌ర్శ‌కుడిగా అవ‌కాశాలు లేక‌, కొరియోగ్ర‌ఫీ కూడా మానేసి అడ్ర‌స్ లేకుండా పోయాడత‌ను. మ‌ధ్య మ‌ధ్య‌లో కొన్ని డ్యాన్స్ షోల్లో క‌నిపించ‌డం మిన‌హా రాజ‌శేఖ‌ర్ లైమ్ లైట్లో లేడు.

బిగ్ బాస్ షో పుణ్య‌మా అని మ‌ళ్లీ ఈ ఏడాది తెర‌పైకి వ‌చ్చాడు అమ్మ రాజ‌శేఖ‌ర్. ఈ షోతో కొంత ఆక‌ట్టుకున్న రాజ‌శేఖ‌ర్ గురించి.. గ్రాండ్ ఫినాలె సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ర‌ణం సినిమా చేయ‌డానికి చాలా ఏళ్ల ముందే ముందే రాజ‌శేఖ‌ర్‌లో ఒక ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌ని తాను గుర్తించాన‌ని.. త‌న‌తో సినిమా చేయ‌మ‌ని రూ.15 ల‌క్ష‌లు అడ్వాన్స్ కూడా ఇచ్చాన‌ని చిరు వెల్ల‌డించ‌డం విశేషం. చిరు చెప్పేంత వ‌ర‌కు రాజ‌శేఖర్ ఈ విష‌యం చెప్ప‌లేదు. చిరు ప్ర‌స్తావించాక అవున‌వును అన్నాడు.

అడ్వాన్స్ తీసుకున్న రాజ‌శేఖ‌ర్ త‌న‌తో సినిమా మాత్రం చేయ‌లేద‌ని చిరు చెప్ప‌గా.. అప్ప‌ట్లో అమ్మ‌కు ఆరోగ్యం బాలేక‌పోవ‌డం, ఇంట్లో స‌మ‌స్య‌ల వ‌ల్ల సినిమా చేయ‌లేక‌పోయాన‌ని.. ఇప్పుడు అవ‌కాశ‌మిస్తే చిరుతో సినిమా తీస్తాన‌ని అన్నాడు. దానికి చిరు బ‌దులిస్తూ.. ఇప్పుడు మ‌ళ్లీ అడ్వాన్స్ ఇవ్వ‌న‌ని.. అప్పుడిచ్చిన‌దానికి వ‌డ్డీ క‌లిపితే కోట్ల‌వుతుంద‌ని.. అదే పారితోష‌కంగా త‌న‌తో సినిమా చేయ‌మ‌ని చెప్ప‌డం విశేషం. ఐతే స‌ర‌దాకు అనుండొచ్చు కానీ.. రాజ‌శేఖ‌ర్ ఇప్పుడున్న స్థితిలో అత‌డికి చిరు అవ‌కాశ‌మిస్తాడా అన్న‌ది సందేహ‌మే.