క‌థ మార్చార‌ని ర‌చ‌యిత హ‌ర్టు

సినిమా క‌థ‌లు ఒక‌లా మొద‌లై చివ‌రికి ఇంకో స్వ‌రూపం తీసుకోవ‌డం మామూలే. ఐతే మొద‌ట క‌థ ఇచ్చిన ర‌చ‌యిత అనుమ‌తితో.. సుహృద్భావంతో వేరే వాళ్లు క‌థ మారిస్తే.. స‌మ‌ష్టిగా దానికి ఒక రూపం తీసుకొస్తే ఓకే. అలా కాకుండా ర‌చ‌యితకు ఇష్టం లేకుండా ఇత‌రులు జోక్యం చేసుకుని క‌థ స్వ‌రూపాన్ని మార్చి.. చివ‌రికి క‌థ‌కుడిగా ఒరిజిన‌ల్ రైట‌ర్‌కు క్రెడిట్ ఇస్తే అది ఇబ్బందిక‌ర‌మే.

అందులోనూ సినిమాకు డివైడ్ టాక్ వ‌చ్చిన‌పుడు.. క‌థ విష‌యంలో విమ‌ర్శ‌లు ఎదురైన‌పుడు ఆ రైట‌ర్ మ‌రింత ఇబ్బంది ప‌డ‌తాడు. టాలీవుడ్ స్టార్ రైట‌ర్ల‌లో ఒక‌రైన సాయిమాధ‌వ్ ఇలాగే ఇప్పుడు హ‌ర్ట‌య్యారు.

త‌న ఫేస్ బుక్ పేజీలో శుక్ర‌వారం ఆయ‌న పెట్టిన పోస్టు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇందులో ఆయ‌న.. ”నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది.. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు.. కథని మానభంగం చేశారు.. నాది రివెంజ్ డ్రామా కాదు.. నా సోల్ వేరు.. అసలా కథే వేరు” అని పేర్కొన్నారు.

సాయిమాధ‌వ్ ఫ‌లానా సినిమా అని చెప్ప‌కపోయినా.. అది శుక్ర‌వారం త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రిలీజైన ఎస్.స‌ర‌స్వ‌తి సినిమా గురించి అన్న‌ది స్ప‌ష్టం. ఈ సినిమాకు క‌థ‌కుడిగా ఆయ‌న పేరే ప‌డింది. సాయిమాధ‌వ్ ప్ర‌ధానంగా మాట‌ల ర‌చ‌యిత‌. క‌థా చ‌ర్చ‌ల్లోనూ భాగం అవుతుంటారు. ఆయ‌న క‌థ‌కుడిగా క్రెడిట్ తీసుకున్న సినిమాలు చాలా త‌క్కువ‌. అందులో ఎస్.స‌ర‌స్వ‌తి ఒక‌టి.

కానీ అది అయిష్టంగా జ‌రిగింద‌ని ఈ పోస్టును బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. స‌మాజంలో ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారిన చిన్న‌పిల్ల‌ల‌పై అఘాయిత్యాల నేప‌థ్యంలో ఈ క‌థ‌ను తీర్చిదిద్దారు. ఐతే ఆరంభంలో కొంచెం భిన్నంగానే అనిపించినా.. ఒక ద‌శ దాటాక రొటీన్ రివెంజ్ డ్రామా రూట్ తీసుకుంది ఈ సినిమా. అదే ఈ చిత్రానికి మైన‌స్ అయింది.

క‌థ మ‌రీ ప్రెడిక్ట‌బుల్ అన్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే సాయిమాధ‌వ్ స్పందించారు. తెర‌పై చూసిన క‌థలో త‌న వాటా త‌క్కువే అని ఆయ‌న స్పష్టం చేశారు. త‌న ఇష్టానికి భిన్నంగా క‌థ‌లో మార్పులు జ‌రిగిన నేప‌థ్యంలోనే ఆయ‌న ఈ సినిమా నుంచి మ‌ధ్య‌లో వైదొలిగి ఉండొచ్చు. మ‌రి ఈ పోస్టు నేప‌థ్యంలో ఈ చిత్ర ద‌ర్శ‌కురాలు, నిర్మాత‌, హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.