మంచు లక్ష్మితో వర్మ.. ఏం రచ్చ చేస్తాడో?

తాను దర్శకత్వం వహించిన సినిమాలు.. ప్రొడ్యూస్ చేసిన సినిమాలు.. పరిచయం చేసిన టెక్నీషియన్లు.. సినిమాల్లో తెచ్చిన మార్పు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీపై చూపిన ప్రభావం.. ఈ కోణాల్లో చూస్తే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద దిగ్గజాల్లో ఒకడిగా రామ్ గోపాల్ వర్మ ఉంటాడు. ఆయనకు ఈ విషయంలో ఎన్నో పురస్కారాలు కూడా ఇవ్వవచ్చు.

ఐతే తన భావజాలాన్ని బయటపెట్టకుండా సైలెంటుగా సినిమాలు తీస్తున్నంత వరకు వర్మ తిరుగులేని స్థాయిలోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మీడియా ముందుకొచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడో.. సోషల్ మీడియా ద్వారా తన మనసులోని భావాలు బయటపెట్టడం మొదలుపెట్టాడో.. అక్కడ్నుంచి ఆయన పతనం మొదలైంది.

వర్మ ఐడియాలజీ విపరీతంగా నచ్చేవాళ్లు కూడా ఉన్నారు కానీ.. ఒక దశ దాటాక వర్మ పూర్తిగా హద్దులు దాటిపోవడం, మాటలు ఎక్కువైపోయి ఆయన చేతల్లో చేవ తగ్గడం.. సినిమాల క్వాలిటీ దారుణంగా పడిపోవడంతో వర్మను సామాన్య జనం లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది.

ఇండస్ట్రీలో ఒకప్పుడు వర్మను ఎంతో గౌరవించిన వాళ్లంతా ఇప్పుడు ఆయన్ని పట్టించుకోవడం లేదు. పూరి జగన్నాథ్ లాంటి ఆయన శిష్యులు ఒకరిద్దరు తప్పితే సోషల్ మీడియాలో వర్మను ట్యాగ్ చేసి ఏ పేరున్న సెలబ్రెటీ మాట్లాడట్లేదు. ఆయన ట్వీట్లపై స్పందించడం లేదు. బాలీవుడ్ వాళ్లు ఎప్పుడో ఆయన్ని వదిలేయగా.. టాలీవుడ్ జనాలు కూడా లైట్ తీసుకున్నారు.

ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి రామ్ గోపాల్ వర్మను గుర్తించింది. భవిష్యత్ సినిమా ఎలా ఉండాలనే అంశం మీద ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ప్రోగ్రాం ఒకటి చేయబోతోంది. సోమవారం సాయంత్రం ఈ ప్రోగ్రాం ఉంటుంది. దీనికి వర్మను గెస్టుగా పిలిచింది లక్ష్మి. వేరే అతిథులు కూడా వస్తారేమో తెలియదు.

ఐతే టీవీ ఛానెళ్లకు వెళ్లి వర్మ ఎలా చర్చల్ని పక్కదోవ పట్టించి నాన్ సీరియస్‌గా మారుస్తుంటాడో తెలిసిందే. మరి ఓ సీరియస్ ఇష్యూ మీద లక్ష్మి నడపనున్న కార్యక్రమంలోకి వచ్చి వర్మ ఏం రచ్చ చేస్తాడో చూడాలి మరి.