టాలీవుడ్ లో ‘ఏఐ’ పంచాయతీ

నిన్న నిఖిల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారమే రేపింది. మేము స్వయంభులో ఏఐ టెక్నాలజీ వాడలేదని, అన్ని ఒరిజినల్ ఎఫెక్ట్స్ అని, ఇటీవలే కంటెంట్ విడుదల చేసిన మరొకరిలా తాము ఏఐ నింపలేదని కామెంట్ చేయడం రకరకాల అర్థాల్లో వెళ్ళిపోయింది.

కొందరు నాగబంధంతో ముడిపెట్టగా మరికొందరు రాజా సాబ్, మార్తాండ ఇలా ఎవరికి తోచిన తరహాలో వాళ్ళు అనాలిసిస్ చేయడం మొదలుపెట్టారు. నిఖిల్ ఏ ఉద్దేశంతో అన్నాడనేది పక్కనపెడితే గత కొన్ని నెలల్లో చాలా వీడియో టీజర్లు ఏఐతో నిండిన మాట వాస్తవం. సామాన్య ప్రేక్షకులు అంత సులభంగా గుర్తు పట్టనంత సహజంగా కొన్ని ఉన్నాయి.

ఇప్పుడంటే ఏఐ గురించి అందరికీ తెలుస్తోంది కానీ నిజానికి రెండేళ్లకు పైగానే విఎఫ్ఎక్స్ కంపెనీల్లో ఇప్పటికే దీని వాడకం పీక్స్ లో ఉంది. జెమిని, చాట్ జిపిటి లాంటివి ఏడాది ఉచిత చందాలు ఇచ్చాక మెల్లగా అందరికీ దగ్గరవుతోంది కానీ ఏఐ సాంకేతికతని పుణికి పుచ్చుకున్న తొలి పరిశ్రమల్లో టాలీవుడ్ కూడా ఉంది.

ఇది మెల్లగా అడ్వాన్స్ స్టేజికి వెళ్తోంది. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు చేసినా జనాలు గుర్తు పెట్టేస్తున్నారు. ఆ మధ్య జటాధరలో విజువల్స్ మీద నెగటివ్ కామెంట్స్ చాలా రావడానికి కారణం ఇదే. అరచేతిలో కొత్త ప్రపంచాన్ని సృష్టించే వీలు ఉన్నప్పుడు బిగ్ స్క్రీన్ కంటెంట్ దానికి వంద రెట్లు రిచ్ గా ఉండాలి.

సరే నిఖిల్ ఎవరిని అన్నాడో ఏ సినిమాను టార్గెట్ చేశాడో అనేది పక్కన పెడితే రాబోయే రోజుల్లో ఈ పోలికల పర్వం తారా స్థాయికి వెళ్లడం ఖాయం. కొన్ని వారాల క్రితం ఒక స్టార్ హీరో ప్రీ లుక్ సైతం ఏఐ వాడి వదిలితే అభిమానులు లైట్ తీసుకున్నారు. సరే పోస్టర్ల వరకు పరిమితమైతే ఇబ్బంది లేదు కానీ ఎటొచ్చి ఫిలిం మేకింగ్ లో కూడా వాడటమే పరిస్థితిని క్లిష్టంగా మారుస్తోంది.

స్వయంభు కోసం విపరీతంగా కష్టపడిన నిఖిల్ టీజర్ కి యునానిమస్ రెస్పాన్స్ ఆశించాడు. అయితే తక్కువ గ్యాప్ లో ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న ప్యాన్ ఇండియా మూవీ టీజర్లన్నీ వచ్చేయడంతో చిక్కొచ్చి పడింది. ముందుగా రిలీజయ్యేది స్వయంభునే కాబట్టి నిఖిల్ కి పెద్ద సవాలే ఎదురు కానుంది.