మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న రాబోతోంది. విడుదలకు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ సినిమాకు సంబంధించిన ఏదో టాపిక్ జనాల్లో నానుతూనే ఉంది. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ మూవీలో తన గెటప్ ఎంత డిఫరెంట్‌గా ఉండబోతుందో చెబుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
జగపతి బాబు ఈ సినిమాలో ‘అప్పలసూరి’ అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన మేకోవర్ ఎంత నేచురల్‌గా ఉందంటే, షూటింగ్ గ్యాప్‌లో ఆయన అదే గెటప్‌తో బయట తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదట. సెట్ నుంచి బయటకు వచ్చి రోడ్డు పక్కన ఉన్న ఒక టీ కొట్టు దగ్గరకు వెళ్లి టీ తాగినా, అక్కడ ఉన్న జనం ఆయన ఒక సెలబ్రిటీ అని కనీసం ఊహించలేకపోయారని జగపతి బాబు చెప్పారు.
సాధారణంగా పెద్ద స్టార్స్ బయటకు వస్తే జనం ఎగబడతారు. కానీ, తన ఆహార్యం, గెటప్ అంతలా మారిపోవడంతో అందరి మధ్యలో ఉన్నా ఎవరూ గుర్తుపట్టకపోవడం తనకు ఆశ్చర్యంగాను, గర్వంగాను అనిపించిందని ఆయన వివరించారు. మేకప్ టీమ్ అంత పర్ఫెక్ట్‌గా తనను మార్చేసిందని, ఆ పాత్రలో అంత సహజత్వం ఉందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సరదా ప్రయోగాన్ని టీమ్ మొత్తం రహస్యంగా రికార్డ్ చేశారట.
టీ కొట్టు దగ్గర తను ఉన్నప్పుడు జనం ఎలా రియాక్ట్ అయ్యారు, తను ఎలా మమేకం అయ్యాడు అనే దృశ్యాలను వీడియో తీశారట. సినిమా విడుదలైన తర్వాత ఆ ఇంట్రెస్టింగ్ వీడియోను అందరితో పంచుకుంటానని జగపతి బాబు ప్రామిస్ చేశారు. అప్పటివరకు ఆ సస్పెన్స్ అలాగే ఉంటుందని నవ్వుతూ చెప్పారు. ఇక ఉప్పెన సినిమాతో తన మేకింగ్ స్టైల్ ఏంటో చూపించిన బుచ్చిబాబు, ఇప్పుడు పెద్ది కోసం జగపతి బాబును సరికొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారని అర్థమవుతోంది. రామ్ చరణ్ ఊర మాస్ లుక్‌తో పాటు జగపతి బాబు అప్పలసూరి క్యారెక్టర్ కూడా ఈ సినిమాకు పెద్ద హైలెట్ కాబోతోందని అర్ధమవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates