ట్రోలింగ్ ట్రోలింగే… వ్యూస్ వ్యూసే

‘బాహుబలి’తో ప్రభాస్ ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగాడో.. ఒకేసారి తన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎన్ని రెట్లయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు భారీ డిజాస్టర్లు ఇచ్చినా సరే.. తన ఫాలోయింగ్ ఏమీ చెక్కు చెదరలేదు. సలార్, కల్కి రూపంలో రెండు మంచి సినిమాలు పడగానే వసూళ్ల మోత మోగింది. రికార్డులు బద్దలయ్యాయి.

ప్రభాస్ పేలవమైన సినిమాలు చేసినా సరే.. ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండదు. ఓవరాల్ వసూళ్ల నంబర్లు కూడా పెద్దగానే ఉంటాయి. చాలామంది స్టార్ల హిట్ సినిమాల కంటే తన ఫ్లాప్ చిత్రాల కలెక్షన్లు ఎక్కువ ఉండడం తన స్థాయిని తెలియజేస్తుంది. అలాగే డిజిటల్‌గా తన సినిమాలు రిలీజైనపుడు కూడా వ్యూయర్‌షిప్ మామూలుగా ఉండదు.

తన ఫ్లాప్ చిత్రాలను ఓవైపు తిట్టుకుంటూనే జనం చూస్తూ ఉంటారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ‘రాజాసాబ్’ విషయంలోనూ అదే జరుగుతోంది.

జియో హాట్ స్టార్‌లో గత వారం ‘రాజాసాబ్’ రిలీజైనప్పటి నుంచి వ్యూస్ మోత మోగిస్తోంది. అప్పట్నుంచి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రమే నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. మలయాళంలో కూడా రెండో స్థానంలో ఉంది. హిందీలో కూడా వ్యూయర్ షిప్‌కు ఢోకా లేదు.

ఈ సినిమా థియేటర్లలో రిలీజైనప్పటి కంటే డిజిటల్‌గా విడుదలైనపుడు ట్రోలింగ్ పెరిగింది. తొలి రోజు నుంచి దర్శకుడు మారుతిని, హీరో ప్రభాస్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. ప్రతి సీన్‌నూ చీల్చి చెండాడుతున్నారు. ఆ ట్రోలింగ్ ఎంతకీ ఆగట్లేదు.

ఐతే ఇలా అయినా సరే.. సోషల్ మీడియాలో సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. హాట్ స్టార్‌లో కూడా జనం సినిమాను తిట్టుకుంటూనే చూస్తూ ఉన్నారు. హాట్ స్టార్ సంస్థ కూడా ఈ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో మరే చిత్రానికీ లేనన్ని పోస్టులు పెడుతూ, యాడ్స్ కూడా ఇస్తోంది. దీంతో వ్యూస్ ఒక రేంజిలో వస్తున్నట్లున్నాయి. ఫ్లాప్ సినిమాతో కూడా ఇలా ట్రెండ్ కావడంతోనే ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.