బాహుబలి మూవీతో ఇండియాలో ఎవరికీ సాధ్యం కాని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాడు ప్రభాస్. కానీ దానికి ఫాలో అప్‌గా అతను సరైన సినిమాలు చేయట్లేదనే అభిప్రాయాలున్నాయి. వరుసగా మూడు డిజాస్టర్ల తర్వాత సలార్, కల్కి చిత్రాలతో మెప్పించినా.. ఎక్కడో ఏదో అసంతృప్తి.
ఇటీవల రాజాసాబ్ అయితే తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే విపరీతంగా బాడీ డబుల్స్ వాడడం మీద ఎంతో ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ అప్రమత్తం కావాల్సిన అవసరముందని తన శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి టైంలోనే రుషి సినిమా తీసిన దర్శకుడు, తర్వాత నటుడిగా కూడా మారిన రాజ్ మాదిరాజు ప్రభాస్ మీద అమితమైన ప్రేమాభిమానాలతో ఒక వీడియో చేశారు.
ప్రభాస్ ప్రత్యేకతేంటో చెబుతూ.. అతను మార్చుకోవాల్సిన విషయాలను ఒక అభిమానిగా చెప్పే ప్రయత్నం చేశారు రాజ్. ఇంతకీ ఆయనేమన్నారంటే..
”ప్రభాస్ ఇది నీకు నేను రాస్తున్న ప్రేమలేఖ. నువ్వొక రారాజు. నీ పేరు వినగానే ఒక అందమైన ఆత్మీయుడు, ఒక అరివీర భయంకురుడైన యోధుడు, ఒక చిలిపి ప్రేమికుడు గుర్తుకొస్తాడు. మగవాళ్ల నడకను సింహంతో పోలుస్తారు కదా. తెలుగులో, ఆ మాటకొస్తే ఇండియాలో నీకు సూటైనట్లు ఇంకెవ్వరికీ సూట్ కాదు.
రజినీకాంత్, హృతిక్ రోషన్ కొంచెం దగ్గరగా వస్తారేమో. నీ ఛాతీ నంబర్ ఎంతో కానీ.. నీ పేరు వినగానే నా ఛాతీ పెద్దదవుతుంది. నీ ఫ్లాప్ సినిమాలు మూడింటి కలెక్షన్ కలిపితే వెయ్యి కోట్లు. నిజంగా అవి బాగుండి జనాలకు నచ్చి హిట్టయి ఉంటే ఆకాశమే హద్దు. నువ్వు కదా నిజమైన గ్లోబల్ స్టార్‌వి.
మా అమ్మాయి తన కాలేజీలో పోస్టర్ క్యాంపైన్ పెడితే కోహ్లి, హ్యారీ పోర్టర్ కంటే కూడా ఎక్కువ పోస్టర్లు నీవే అమ్ముడయ్యాయి. అది నీ స్టామినా, అది నీకున్న ఫాలోయింగ్. డార్లింగ్ నేను నీ సగటు ఫ్యాన్ కాదు. నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు అడుగుతాను.
నువ్వు నీ బాడీ మీద, భాష, వాచకం మీద శ్రద్ధ పెట్టి ఎన్నాళ్లయింది? నీ ఫిగరెందుకు చిందరవందర అయింది? నీ గొంతెందుకు ముద్దగా వస్తోంది? నీ కళ్ల కింద నల్లగా క్యారీ బ్యాగులు వచ్చాయి. నీ నడకలో గ్రేస్ ఏమైంది? నీ కదలికల్లో చురుకుదనం ఏమైంది? ఎందుకు నీలో మోటివేషన్ తగ్గిపోతోంది?
ఎందుకు నీ అభిమానులను, మార్కెట్‌ను టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నావు? నీ అభిమానులను కొత్తగా మెప్పించడానికి, కొత్త అభిమానులను తయారు చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు?నీలో ప్రొఫెషనలిజం ఎందుకు తగ్గుతోంది? నీ పొటెన్షియల్‌కు తగ్గట్లు కష్టపడుతున్నావా? కమాన్ ప్రభాస్ నీకు 45 ఏళ్లే.
విపరీతంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్లయి కూడా నీ సినిమాలు చూడాలి. కాబట్టి మిర్చి టైం ఫిగర్, ఛత్రపతి లాంటి వర్చస్సుతో, బాహుబలిలాంటి మహానాయకుడి తేజస్సుతోటి నువ్వు తిరిగి వస్తావని ఆశిస్తున్నా” అంటూ ముగించారు రాజ్. నిజమైన అభిమానిలా స్పందిస్తూ చేసిన ఈ వీడియో ప్రభాస్ చూసి తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates