ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. దాదాపు 16 ఏళ్ల క్రితం మొదలైన ఒక ఆర్థిక వివాదం చివరకు ఆయనను జైలు గడప తొక్కేలా చేసింది. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయన విన్నపాన్ని తిరస్కరించడంతో, రాజ్‌పాల్ యాదవ్ తీహార్ జైలులో లొంగిపోయారు. కోట్లాది మందిని తన కామెడీ టైమింగ్ తో నవ్వించిన నటుడు, ఇప్పుడు తన సొంత సమస్యలతో కంటతడి పెట్టుకోవడం అభిమానులను కలిచివేస్తోంది.
అసలు ఈ గొడవ 2010లో రాజ్‌పాల్ యాదవ్ దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా’ సినిమాతో మొదలైంది. ఆ సినిమా నిర్మాణం కోసం మురళీ ప్రాజెక్ట్స్ సంస్థ నుండి ఆయన రూ.5 కోట్ల అప్పు తీసుకున్నారు. దురదృష్టవశాత్తూ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమవడంతో రాజ్‌పాల్ ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. తీసుకున్న అప్పు తీర్చలేకపోవడం, ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవ్వడంతో వ్యవహారం కోర్టుకు చేరింది.
కాలక్రమేణా వడ్డీతో కలిపి ఆ మొత్తం దాదాపు రూ.9 కోట్లకు చేరుకుంది. రాజ్‌పాల్ యాదవ్ మధ్యమధ్యలో కొంత మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చారు, గత ఏడాది కూడా రూ.75 లక్షలు కట్టారు. అయితే పూర్తి మొత్తం చెల్లించడానికి కోర్టు ఇచ్చిన గడువులను ఆయన పాటించకపోవడంతో న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన పదే పదే మినహాయింపులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ, ఫిబ్రవరి 4న న్యాయమూర్తి ఆయన పిటిషన్‌ను కొట్టేశారు.
జైలుకు వెళ్లే ముందు రాజ్‌పాల్ యాదవ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. “సార్ ఏం చేయను? నా దగ్గర పైసలు లేవు.. మరో దారి కనిపించడం లేదు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కష్టకాలంలో ఎవరూ తోడుండరని, ఈ సంక్షోభాన్ని తానే ఒంటరిగా ఎదుర్కోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చివరకు లొంగిపోవాల్సి వచ్చింది. మరి ఈ కష్టాల నుంచి రాజ్‌పాల్ ఎప్పుడు బయటపడతారో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates