థియేటర్లకు రాకుండా మంచి పని చేసింది

గత నెల సంక్రాంతి పండగ సందర్భంగా తమిళంలో విడుదలైన పరాశక్తిని ఆ టైంలోనే తెలుగులోనూ సమాంతరంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ సెన్సార్ సమస్యలతో పాటు థియేటర్ల కొరత కారణంగా నిర్మాతలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

ఆకాశం నీ హద్దురా దర్శకురాలు సుధా కొంగర, అమరన్ హీరో శివ కార్తికేయన్ కాంబినేషన్ కావడంతో టాలీవుడ్ మూవీ లవర్స్ దీని మీద బాగానే ఆసక్తి చూపించారు. కానీ తమిళ వెర్షన్ అనూహ్యంగా ఫ్లాప్ అయ్యింది. అంచనాలు అందుకోలేక చేతులు ఎత్తేసింది. దీంతో లేట్ గా అయినా డబ్బింగ్ రిలీజ్ చేద్దామనుకున్న ప్రొడ్యూసర్లు అక్కడితో ఆగిపోయారు.

ఇప్పుడీ పరాశక్తి ఓటిటిలో వచ్చేసింది. తెలుగులోనూ ఉంది. డబ్బింగ్ లో మంచి క్వాలిటీ ఉంది. శ్రీలీల రెండు భాషల్లో స్వంత గొంతు వినిపించింది. అయితే పరాశక్తి మన దగ్గర థియేటర్లకు రాకుండా మంచి పని చేసింది. ఎందుకంటే 1960లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యయంతో మనకు సంబంధం లేదు. అది కేవలం తమిళనాడుకి పరిమితమయ్యింది. ఇది టాలీవుడ్ జనాలకు ఎక్కదు.

అసలు హిందీని అపోజ్ చేసే అవసరం ఉమ్మడి రాష్ట్రంలో అంతగా పడలేదు. అలాంటప్పుడు పరాశక్తి కాన్సెప్ట్ ని డైజెస్ట్ చేసుకోవడం కష్టం. అందుకే ఇంత పెద్ద మూవీ డిజిటల్ లో వచ్చాక కూడా సోషల్ మీడియాలో సౌండ్ వినిపించడం లేదు.

దీని రిజల్ట్ పట్ల తీవ్రంగా నిరాశ చెందిన వాళ్ళు ఇద్దరు. శివ కార్తికేయన్ దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అవి నీరుగారిపోయాయి. పైగా అయలన్ కాకుండా తెలుగులో అనువాదం కాకుండా పోయిన రెండో సినిమా ఇది. కోలీవుడ్ లో బలమైన డెబ్యూ దొరుకుతుందని భావించిన శ్రీలీలకు సైతం ఎదురు దెబ్బ తగిలింది.

సహజత్వానికి పెద్ద పీఠ వేసే సుధాకొంగర ఇందులో రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ తరహాలో ఫైట్లు గట్రా పెట్టడం కామెంట్స్ కు దారి తీసింది. మొత్తానికి పరాశక్తి రూపంలో పెద్ద షాకే తగిలింది. దెబ్బకు వెంకట్ ప్రభు దర్శకత్వంలో శివ కార్తికేయన్ చేస్తున్న మూవీ కొంచెం ఆలస్యమవుతున్నట్టు చెన్నై టాక్.