అనుదీప్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదెవరు?

టాలీవుడ్‌లో ఒక వెరైటీ కామెడీ టైమింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అనుదీప్ కేవీ. ‘జాతిరత్నాలు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈయన, రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ అయిపోయారు. కానీ ఆ క్రేజ్ ఇప్పుడు కాపాడుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడిపోతున్నారు. వరుసగా చేస్తున్న సినిమాలు ఆడియన్స్‌కు ఒకేలా అనిపిస్తుండటంతో, ఇప్పుడు అనుదీప్ తదుపరి అడుగుపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు మొదలయ్యాయి.

రీసెంట్ గా వచ్చిన ‘ఫంకీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర గట్టి దెబ్బేసింది. ‘జాతిరత్నాలు’ తర్వాత వచ్చిన ‘ప్రిన్స్’ తోనే మేకింగ్ స్టైల్ మీద విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ‘ఫంకీ’ కూడా అదే బాటలో పయనించి ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఒకే రకమైన సిల్లీ జోకులు, పాతబడిన పంచ్‌లనే మళ్ళీ మళ్ళీ వాడటం వల్ల ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని అర్థమైపోయింది. ప్రతీసారి అదే మ్యాజిక్ వర్కవుట్ అవ్వదు అనే విషయం ‘ఫంకీ’ రిజల్ట్ తో స్పష్టమైంది.

అనుదీప్ గతంలో ‘ఫంకీ’ కంటే ముందే తన లక్కీ హీరో నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు. కానీ ఎందుకో ఆ క్రేజీ కాంబో పట్టాలెక్కలేదు. ‘జాతిరత్నాలు’ లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అనుదీప్‌ని నవీన్ ఇప్పుడు మళ్ళీ నమ్ముతారా అనేది ఒక పెద్ద ప్రశ్న. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ, కెరీర్ పరంగా చూస్తే మాత్రం నవీన్ ఇప్పుడు చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఫ్లాపుల్లో ఉన్న స్నేహితుడికి నవీన్ మరో ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి.

సినిమా మేకింగ్ లో అనుదీప్ రైటింగ్ చాలా వీక్ అయిందని ‘ఫంకీ’ చూస్తే క్లియర్ గా తెలుస్తోంది. తన సినిమాల్లో హీరోలను తనలాగే చూపించడానికి ట్రై చేయడం విశ్వక్ సేన్ లాంటి మాస్ హీరో విషయంలో అస్సలు సెట్ కాలేదు. కేవలం ఇంటర్వ్యూల్లో నవ్వించినంత ఈజీగా స్క్రీన్ మీద మేజిక్ చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఏ స్టార్ హీరో ఈయనకు డేట్స్ ఇస్తారనేది మిస్టరీగా మారింది.

కొంతమంది అగ్ర నిర్మాతలతో అనుదీప్‌కు ఇప్పటికే కమిట్మెంట్స్ ఉన్నాయి. కానీ ప్రాజెక్ట్ ఓకే అవ్వాలంటే హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ప్రస్తుతానికి టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోలందరూ ఇంటెన్స్ కథల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి టైంలో అవుట్ డేటెడ్ పంచ్ డైలాగులతో వచ్చే అనుదీప్ వైపు ఎవరు చూస్తారో వెయిట్ చేయాల్సిందే. తన కామెడీ స్టైల్ మార్చుకోకపోతే మాత్రం గడ్డు కాలం తప్పదు.