యష్ మీద ఒత్తిడి పెరుగుతోంది

తెలుగు, తమిళంతో పోలిస్తే మార్కెట్, బడ్జెట్ పరంగా వెనుకబడి ఉన్న కన్నడ పరిశ్రమను ఒకేసారి పది మెట్లు ఎక్కించిన సినిమా కెజిఎఫ్. ప్యాన్ ఇండియా లెవెల్ లో అది సాధించిన విజయం చూసే కాంతార లాంటి వాటికి స్ఫూర్తి దొరికింది. అది కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. పులిని చూసి నక్క వాత బెట్టుకున్నట్టు కబ్జా లాంటి చేతులు కాల్చుకున్న ప్రయత్నాలు లేకపోలేదు. అందుకే యష్ అంటే శాండల్ వుడ్ వర్గాల్లో ప్రత్యేకమైన గౌరవం ఉంది.

కానీ టాక్సిక్ విషయంలో జరుగుతున్న పరిణామాలు కన్నడ మూవీ లవర్స్ కు మింగుడుపడటం లేదు. ముఖ్యంగా యష్ మీద దీని గురించే ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మార్చి 19 విడుదల కానున్న టాక్సిక్ మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. అయితే చేతిలో కేవలం 16 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ ప్రమోషన్స్ పరంగా ఆశించిన వేగం లేదనేది వాళ్ళ కంప్లయింట్.

నిన్న రిలీజ్ చేసిన తబాహి పాటలో లిరిక్స్, విజువల్స్ లేకుండా కేవలం ఆడియోని మాత్రమే వదలడం ఇప్పటికే విమర్శలు మూటగట్టుకుంది. ఎప్పుడో ఏప్రిల్, ఆగస్టులో వచ్చే పెద్ది, ప్యారడైజ్ పాటలు నేషనల్ లెవెల్ లో సెన్సేషన్ అయితే టాక్సిక్ మాత్రం నింపాదిగా ఉండటం ఎంత మాత్రం రైట్ కాదని కామెంట్ చేస్తున్నారు. వాళ్ళన్నది నిజమే. ఇప్పటిదాకా వావ్ అద్భుతం అనిపించే కంటెంట్ టాక్సిక్ నుంచి రాలేదు.

ఇక్కడింకో ప్రధానమైన సమస్య ఉంది. అదే రోజు దురంధర్ 2 ది రివెంజ్ వస్తోంది. సీక్వెల్ కాబట్టి దానికి అతి పబ్లిసిటీ అవసరం లేదు. మొదటి భాగం ఇచ్చిన సక్సెస్  ఎలాంటి ప్రచారం అవసరం లేనంత హైప్ తీసుకొచ్చింది. కాబట్టే దర్శకుడు ఆదిత్య దార్ ఇదేమంత సీరియస్ మ్యాటర్ కాదన్నట్టు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ ఉన్నాడు. కానీ టాక్సిక్ అలా కాదు. సీక్వెల్ అడ్వాంటేజ్ లేదు. యానిమల్ లాగా దర్శకుడి బ్రాండ్ ఉపయోగించలేరు.

ఎందుకంటే టాక్సిక్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ సాధారణ ప్రేక్షకులకు పరిచయం లేని పేరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టాక్సిక్ ని పైకి లేపాల్సిన బాధ్యత టీమ్ మీద ఉంది. ఓవర్సీస్ బుకింగ్స్ వేగంగా ఉన్నాయి. ఇక్కడా అలాగే జరగాలంటే ఆ బాధ్యత ట్రైలర్ మీద ఉంది. చూడాలి మరి ఎలాంటి అవుట్ ఫుట్ ఇవ్వబోతున్నారో.