‘మళ్లీ దర్శకుడిగా పుట్టను’.. దర్శకుడి వివరణ

సినీ రంగంలోకి కాస్త పేరు తెచ్చుకున్న ఎవ్వరైనా.. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలా పుట్టాలని కోరుకోను అన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా దర్శకుడిగా గొప్ప విజయాలు అందుకున్న వ్యక్తి ఈ మాట అనడం ఇంకా షాకింగ్. సొగసు చూడతరమా, బాల రామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు లాంటి మరపురాని సినిమాలు తీసిన గుణశేఖర్ ఈ మాట అన్నాడు.

మళ్లీ జన్మంటూ ఉంటే దర్శకుడిగా పుట్టను అని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతగా ఆయనకు ఏం విరక్తి వచ్చిందనే ప్రశ్న తలెత్తింది. ఆ కామెంట్ మీద గుణశేఖర్ తాజాగా వివరణ ఇచ్చాడు. ఇది విమర్శల వల్లో, నష్టాల వల్లో చేసిన కామెంట్ కాదని చెప్పాడు గుణ.

‘‘ట్రోలింగ్ అన్నది సమస్య కాదు. అది ఎప్పుడూ ఉంటుంది. ఓ దర్శకుడు పడే ఒత్తిడి గురించి చెబుతూ ఆ మాట అన్నాను. దర్శకుడి కుర్చీలో కూర్చున్న ఎవ్వరికైనా ఒత్తిడి తప్పదు. ఏ పనిలో అయినా సంతృప్తి ఉంటుంది కానీ.. దర్శకులకు ఉండదని నా అభిప్రాయం. తృప్తి ఉంటే కంటి నిండా నిద్ర పడుతుంది. అలాంటి నిద్రను నేను 1992లో వదిలేశాను.

ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నా. వచ్చే జన్మలో అయినా హాయిగా నిద్ర పోవాలనే ఉద్దేశంతో మళ్లీ డైరెక్టర్‌గా పుట్టను అని అన్నాను’’ అని గుణశేఖర్ వివరించాడు. చాన్నాళ్లుగా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. ‘రుద్రమదేవి’తో ఆయన చేసిన సాహసం ఫలితాన్నిచ్చింది కానీ.. ‘శాకుంతలం’ దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘యుఫోరియా’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భూమిక, సారా అర్జున్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.