సురేష్ 7.. తరుణ్ 10.. చివరికేమో 12

ఒక క్రేజీ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతుంటే.. దాని నిర్మాత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం అరుదైన విషయం. ఏదైనా వివాదం తలెత్తి నిర్మాత పక్కకు వెళ్తే వేరే విషయం. కానీ బడ్జెట్ తాను అనుకున్న దాని కంటే కొంచెం ఎక్కువ అయ్యేలా ఉందని ప్రొడ్యూసర్ తప్పుకున్నాడంటే.. అది కొంచెం ఆశ్చర్యం కలిగించేదే. ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ విషయంలో సురేష్ బాబు ఇలాగే వైదొలిగారట.

ఈ ప్రాజెక్టును కొత్త ప్రొడ్యూసర్ సృజన్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి సృజన్‌తో కలిసి సురేష్ బాబు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాల్సిందట. కానీ ఆయన చెప్పిన దాని కంటే బడ్జెట్ అంచనాలు పెరగడం వల్ల ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగారట. కానీ ఇక్కడ గొడవేమీ లేదని.. సుహృద్భావ వాతావరణంలోనే ఆయన సీక్వెల్ రైట్స్ ఇచ్చేసి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని ‘గుల్టే’ ఇంటర్వ్యూలో సృజన్ వెల్లడించాడు.

‘ఈఎన్ఈ రిపీట్’ సినిమాను రూ.7 కోట్ల బడ్జెట్లో తీయాలన్నది సురేష్ బాబు ఆలోచనట. కానీ బడ్జెట్ లెక్కలు వేస్తే పేపర్ మీద నంబర్ రూ.10 కోట్లు వచ్చినట్లు సృజన్ తెలిపాడు. సురేష్ బాబు అంచనా కంటే కేవలం రూ.3 కోట్లే పెరిగినప్పటికీ.. చివరికి ఖర్చు దాన్ని మించి ఎక్కడికో వెళ్తుందని సురేష్ బాబు భయపడ్డారట.

ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లకు వాళ్ల స్థాయికి మించి రెమ్యూనరేషన్లు ఇస్తున్నారన్నది సురేష్ బాబు అంచనా అని.. సినిమా తీసేసరికి బడ్జెట్ రూ.15-16 కోట్లకు వెళ్తుందని.. అది రూ.20 కోట్లను టచ్ చేసినా చేయొచ్చని ఆయన భయపడ్డారని సృజన్ తెలిపాడు. అందుకే సీక్వెల్ రైట్స్ తనకు ఇచ్చేసి ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని అతను వెల్లడించాడు. 

కానీ తాము ఎక్కువ వృథా ఖర్చు లేకుండా చూసుకుని అటు ఇటుగా రూ.12.3-12.4 కోట్లలోనే సినిమాను ఫినిష్ చేసినట్లు అతను తెలిపాడు. జులైకల్లా సినిమాను పూర్తి చేసి అక్టోబరు 2న రిలీజ్ చేయాలన్నది ముందు అనుకున్న ప్లాన్ అని.. కాకపోతే సినిమా నవంబరు 19కి వెళ్లడంతో వడ్డీలు, ఇతర ఖర్చులు కాస్త పెరిగి బడ్జెట్ ఆ మేరకు పెరిగిందని సృజన్ తెలిపాడు. ఇక్కడ ఖర్చు పెరిగితే ఫారిన్ షెడ్యూల్లో కొంత మేర వర్కింగ్ డేస్ తగ్గించి ఖర్చును తరుణ్ తగ్గించాడని సృజన్ తెలిపాడు.