ఆ మధ్య డెకాయిట్ టీజర్ లాంచ్ జరిగినప్పుడు పోటీ గురించి ప్రస్తావిస్తూ అడివి శేష్ ఒక మాట అనడం అభిమానులకు గుర్తే. కాంపిటీషన్ లో ఎన్ని బిగ్ ఫిష్ వచ్చినా తాను గోల్డెన్ ఫిష్ గా వర్ణించుకుని చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తపరిచాడు. గతంలో విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో తలపడి గెలిచిన వైనాన్ని గుర్తు చేసుకున్నాడు.
కానీ పరిస్థితులు అన్నివేళలా ఒకేలా ఉండవుగా. మార్చి 19 దురంధర్ 2 ది రివెంజ్ విడుదల కానుంది. దీనికన్నా ముందే అడివి శేష్ డెకాయిట్ అదే డేట్ లాక్ చేసుకుంది. తర్వాత దురంధర్ విడుదలై ఇండస్ట్రీ హిట్ సాధించింది. దీంతో ఒక్కసారిగా లెక్కలు, అంచనాలు మారిపోయి నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డెకాయిట్ మార్చి 19 నుంచి తప్పుకుందట. ఎందుకంటే దురంధర్ 2 హైప్ తో పాటు టాక్సిక్ కూడా వెనుకడుగు వేసే అవకాశం తక్కువగా ఉండటంతో ప్యాన్ ఇండియా స్థాయిలో అడివి శేష్ కు థియేటర్ల సమస్య వస్తుంది. పైగా వాటి మధ్య నలిగిపోతే లేనిపోని ఇబ్బంది.
అందుకే ఏప్రిల్ కి షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనలో అన్నపూర్ణ స్టూడియోస్ సీరియస్ గా ఉందని తెలిసింది. ఏప్రిల్ 10 ప్రాథమికంగా ఫిక్స్ చేసుకున్నారట. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అదే టైంలో రావొచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డెకాయిట్ వీలైనంత త్వరగా డెసిషన్ చెబితే మంచిది.
మేజర్, హిట్ 2 ది సెకండ్ కేస్ తర్వాత అడివి శేష్ కు చాలా గ్యాప్ వచ్చింది. హిట్ 3లో చిన్న క్యామియో చేసినా దాని వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. ఫుల్ లెన్త్ మూవీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. డెకాయిట్ తో పాటు గూఢచారి 2 కూడా ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలని శేష్ టార్గెట్.
కానీ జరుగుతున్న ఆలస్యాలు చూస్తుంటే ఏ మేరకు సాధ్యమవుతుందో వెంటనే చెప్పలేని సిచువేషన్ నెలకొంది. అయినా డెకాయిట్ కు ఆది నుంచి అవాంతరాలే. ముందు హీరోయిన్ మారింది. తర్వాత శేష్ కు చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు విడుదల వాయిదాల పర్వంలో నలిగిపోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates