పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతికి జరుగుతున్న వసూళ్ల జాతర పెద్ద దర్శక నిర్మాతలను అదే సీజన్ ని టార్గెట్ చేసుకునేలా ప్రేరేపిస్తోంది. 2027 జనవరి పండక్కు ఇప్పటి నుంచే కర్చీఫులు వేయడం స్టార్టయిపోయింది.
కానీ ఇందులో సాధ్యాసాధ్యాలు ఒకసారి గమనిద్దాం. ముందుగా అనిల్ రావిపూడి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫెస్టివల్ మిస్ కాడనేది బహిరంగ రహస్యం. వెంకటేష్ హీరోగా రానా లేదా కార్తీ లేదా ఫహద్ ఫాసిల్ మరో ముఖ్య పాత్రలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కు రంగం సిద్ధమయ్యింది. నిర్మాత ఫిక్సయ్యాక ప్రకటన వస్తుంది.
అనిల్ రాకలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఎందుకంటే వేగంగా తీయడంతో తనకు ఎవరూ సాటి రారు. పైగా విఎఫ్ఎక్స్, లొకేషన్స్ ఎక్కువ డిమాండ్ చేయని కథలు రాసుకుంటాడు కాబట్టి టెన్షన్ ఉండదు. చిరంజీవి – బాబీ కలయికలో తెరకెక్కబోయే గ్యాంగ్ స్టర్ డ్రామాని కెవిఎన్ సంస్థ నిర్మించాల్సి ఉంది.
అయితే జన నాయకుడు వాయిదా, టాక్సిక్ బడ్జెట్ లాంటి కారణాలు ఈ ప్రాజెక్టు ఆలస్యానికి కారణమవుతున్నాయి. సో ఇది క్లియర్ అయితే తప్ప షూటింగ్ మొదలుపెట్టలేరు. పెద్ద బడ్జెట్ కాబట్టి టార్గెట్ పెట్టుకుని అంత ఆషామాషీగా అయితే పరుగులు పెట్టించలేరు. మధ్యలో విశ్వంభర ప్రమోషన్లకు చిరు టైం కేటాయించాలి.
ఇక బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోయే మూవీ కూడా సంక్రాంతి ఆప్షన్ వైపే చూస్తోందని ఇన్ సైడ్ టాక్. రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభించబోతున్నారు. పీరియాడిక్ సెటప్ నుంచి గ్యాంగ్ స్టర్ డ్రామా వైపు కథ మారినట్టు ఆల్రెడీ న్యూస్ ఉంది.
ఇక నాగార్జున. ఈయన వచ్చే ఛాన్స్ అయితే తక్కువే. ఎందుకంటే ప్రస్తుతం ఆర్ కార్తీక్ దర్శకత్వంలో చేస్తున్న వందో సినిమా ఈ ఏడాదే రిలీజ్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల లేట్ అయితే తప్ప తన ముగ్గురు సమకాలీకులతో పోటీ పడటం ఉండకపోవచ్చు. ప్రాధమిక దశలోనే సంక్రాంతి క్లాష్ గురించి ఇంత చర్చ జరిగితే రాబోయే రోజుల్లో ఇంకెంత డిస్కషన్ ఉంటుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates