ప్రమోషన్లలో మోసపోతున్న యంగ్ హీరో

తిరువీర్.. ఈ పేరు చూసి ఇప్పటికీ ఎవరో పరభాషా నటుడు అనుకుంటూ ఉంటారు కానీ.. అతను అచ్చమైన తెలుగు కుర్రాడు. చేసినవి తక్కువ సినిమాలే అయినా నటుడిగా చాలా మంచి పేరు సంపాదించాడు తిరువీర్. జార్జిరెడ్డి, పలాస చిత్రాల్లో నెగెటివ్ రోల్స్‌తో బలమైన ముద్ర వేసిన అతను.. లీడ్ రోల్స్ చేసిన మసూద, పరేషాన్, ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో చిత్రాలతోనూ ఆకట్టుకున్నాడు. 

కాకపోతే తన సినిమాలు కంటెంట్‌కు తగ్గట్లుగా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాలేదన్న అసంతృప్తి అతడిలో ఉంది. ముఖ్యంగా ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ చాలా మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఈ చిత్రాన్ని రిలీజ్ ముంగిట సరిగా ప్రమోట్ చేయకపోవడం మైనస్ అయింది. సినిమా రిలీజవుతున్నట్లే జనాలకు తెలియని పరిస్థితి. విడుదల తర్వాత మంచి టాక్ వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోయారు.

ప్రమోషన్ల విషయంలో ఎందుకు వెనుకబడుతున్నారు అని తన కొత్త చిత్రం ‘భగవంతుడు’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో విలేకరులు అడిగితే.. అందులో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పాడు తిరువీర్. తన వంతుగా ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ను సొంతంగా బాగానే ప్రమోట్ చేశానన్నాడు.

ఐతే తన నిర్మాతలు మొదట్లో ప్రమోషన్ కోసం వేరుగా బడ్జెట్ ఉందని చెబుతున్నారని.. కానీ రిలీజ్ టైంకి వచ్చేసరికి డబ్బులు అయిపోయాని, రావాల్సినవి రాలేదని చెబుతున్నారని తిరువీర్ చెప్పాడు. ఆ రకంగా తన సినిమాలకు సరైన ప్రమోషన్ జరగడం లేదన్నది వాస్తవమేనన్నాడు. 

ఫలానా జర్నలిస్టులతో ఇంటర్వ్యూలు చేస్తే జనాలకు బాగా రీచ్ అవుతాయి, వైరల్ అవుతాయి అని అడిగితే.. వాళ్లు డబ్బులు అడుగుతారు, మేం ఇవ్వలేం అని నిర్మాతలు తనకు చెప్పినట్లు తిరువీర్ వెల్లడించాడు. మీడియాలో అలాంటిదేమీ ఉండదని విలేకరులు చెబితే.. తనకు దాని గురించి తెలియదని, నిర్మాతలు తనతో అలా అన్నారని తిరువీర్ తెలిపాడు.

ఒక రకంగా ప్రమోషన్ల విషయంలో నిర్మాతలే తనను దెబ్బ తీస్తున్నట్లుగా అతను చెప్పుకొచ్చాడు. ఇకపై మాత్రం తన సినిమాలను గట్టిగా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తానని తిరువీర్ స్పష్టం చేశాడు.