ప్రతి హీరో కెరీర్లో ఒక్కసారి అయినా కాలంలో వెనక్కి ప్రయాణించాలనుకుంటాడు. కొన్ని దశాబ్దాల వెనుకటి కథలతో సినిమాలు చేయాలనుకుంటాడు. వింటేజ్ టచ్ ఉన్న కథల్లో నటించడం ఎవరినైనా ఎగ్జైట్ చేస్తుంది. మెగా హీరోల్లో ఆల్రెడీ చాలామంది ఆ టైపు కథలు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అలాంటి కథతోనే ‘పుష్ప’ చేస్తున్నాడు.
త్వరలోనే సాయిధరమ్ తేజ్ సైతం ఈ లీగ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. అతను 50 ఏళ్ల వెనుకటి నేపథ్యంతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ చిత్రానికి దర్శకుడు కార్తీక్ దండు. ఇతను అగ్ర దర్శకుడు సుకుమార్ శిష్యుడు. సుక్కు రాసిన కథతోనే సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు తేజు.
ఇది 70వ దశకం నేపథ్యంలో నడిచే మిస్టరీ థ్రిల్లర్ కథ అని చెప్పాడు. తన కెరీర్లో ఇంతకుముందెన్నడూ ఇలాంటి కథలో నటించలేదని.. ఇది తనకో వైవిధ్యమైన సినిమా అవుతుందని తేజు తెలిపాడు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న తేజు సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ను నిర్మించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాదే.. సుకుమార్‌తో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాడట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. సుకుమార్ కథ.. పైగా 70వ దశకంలో సాగేది అంటే.. ఇందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే భావిస్తున్నారు.
ఇది కాక తేజు.. దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్న ఆ చిత్రం షూటింగ్ 60 శాతం పూర్తయినట్లు తేజు వెల్లడించాడు. అది పొలిటికల్ డ్రామా అన్న సంగతి తెలిసిందే. ఇందులో తేజు నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి పాత్ర పోషిస్తున్నాడట. ‘ప్రస్థానం’తో అందరినీ ఆశ్చర్యపరిచిన దేవా.. ఆ తర్వాత అంచనాలు అందుకోలేకపోయాడు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates