మారుతికి కొత్త‌ర‌కం టార్చ‌ర్

రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండ‌ద‌ని చెబుతూ, ప్ర‌భాస్ అభిమానుల‌కు భ‌రోసానిస్తూ, తేడా వ‌స్తే త‌న ఇంటికి వ‌చ్చి మాట్లాడొచ్చంటూ అడ్ర‌స్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు మారుతి. ఇది సినిమాపై త‌న కాన్ఫిడెన్స్ ఎలాంటిదో చూపించింది.

మారుతి ఇంటి అడ్ర‌స్ తెలుసుకున్న ప్ర‌భాస్ అభిమానులు.. రిలీజ్ ముంగిట అత‌డి మీద అమిత‌మైన ప్రేమ‌ను చూపించారు. త‌న ఇంటికి బిరియానీలు ఆర్డ‌ర్ చేసి పంపించారు. దీని గురించి మారుతి చాలా సంతోషంగా పోస్టు కూడా పెట్టాడు. 

ఇలా రిలీజ్ ముందు వ‌ర‌కు మారుతికి, ప్ర‌భాస్ అభిమానుల‌కు మ‌ధ్య అనుబంధం బాగానే సాగింది కానీ.. రాజాసాబ్ విడుద‌ల త‌ర్వాతే క‌థ మారిపోయింది. సినిమా అంచ‌నాల‌ను అందుకోక‌పోవ‌డంతో మారుతి మీద ప్ర‌భాస్ అభిమానుల ఆగ్ర‌హం మామూలుగా లేదు.

ముఖ్యంగా సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ ముగిశాక మారుతి మీద యుద్ధం ప్ర‌క‌టించారు రెబ‌ల్ ఫ్యాన్స్. కొన్ని రోజుల పాటు అదే ప‌నిగా మారుతిని, అతడి మిత్రుడు- మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ఎస్కేఎన్‌ను టార్గెట్ చేస్తూ నెగెటివ్ పోస్టులు పెట్ట‌డం, బూతులు తిట్ట‌డం తెలిసిందే.

దీంతో ఎస్కేఎన్ కొంతమంది అభిమానుల మీద సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయినా ప్ర‌భాస్ ఫ్యాన్స్ త‌గ్గ‌ట్లేదు. మారుతి మీద యుద్ధాన్ని ఆప‌ట్లేదు. ఈ ద‌ర్శ‌కుడికి ఇంటికి ఇప్పుడు కూడా ప్ర‌భాస్ ఫ్యాన్స్ బిరియానీలు, వేరే ఫుడ్ ఆర్డ‌ర్ పెడుతున్నారు.

కాక‌పోతే ఇవి ప్రేమ‌తో పంపుతున్న పార్సిల్స్ కావు. వాటికి అభిమానులు డ‌బ్బులు చెల్లించ‌ట్లేదు. క్యాష్ ఆన్ డెలివ‌రీ ఆప్ష‌న్ పెట్టి ఫుడ్ ఆర్డ‌ర్స్ మారుతి ఇంటికి పంపిస్తున్నార‌ట ప్ర‌భాస్ ఫ్యాన్స్. ఇలా ఇప్ప‌టిదాకా వంద‌కు పైగా ఆర్డ‌ర్లు మారుతి ఇంటికి వెళ్లాయ‌ట‌. ఫుడ్ డెలివ‌రీ బాయ్స్ ఆర్డ‌ర్స్ తీసుకెళ్ల‌డం… గేట్ దగ్గర సెక్యూరిటీ ఆపడం.. తిరిగి వచ్చేయడం.. ఇదే జరుగుతుంది.

కొన్ని రోజులుగా మారుతికి ఇది పెద్ద త‌ల‌నొప్పిగా త‌యారైంద‌న్న‌ది అత‌డి స‌న్నిహితుల స‌మాచారం. మారుతిని ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో మామూలుగా ఎటాక్ చేయ‌లేదు ప్ర‌భాస్ ఫ్యాన్స్. అది చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు ఫుడ్ ఆర్డ‌ర్స్‌తో టార్చ‌ర్ పెట్ట‌డం ఏం న్యాయ‌మ‌నే ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి.

త‌మ మీద ఎస్కేఎన్ ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా ట్రోల్స్ ప‌క్క‌న పెట్టి మారుతిని ఇబ్బంది పెట్ట‌డానికి ఈ మార్గాన్ని ఎంచుకున్న‌ట్లున్నారు ఫ్యాన్స్. ఐతే సినీ రంగంలో హిట్లు ఫ్లాపులు కామ‌న్ కాబ‌ట్టి రాజాసాబ్ సంగ‌తి ప‌క్క‌న పెట్టి ప్ర‌భాస్ లాగే ఫ్యాన్స్ కూడా మూవ్ ఆన్ అవ్వాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది.