ధనుష్ కి బాడీ గార్డులుగా మారిన కొడుకులు

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ ఇప్ప‌టికీ చూడ్డానికి కుర్రాడిలాగే ఉంటాడు. చ‌క్క‌గా ప్రేమ‌క‌థ‌లూ చేసుకుంటున్నాడు. కానీ అత‌డికి టీనేజీలో ఉన్న ఇద్ద‌రు కొడుకులున్నారు. అందులో ఒక‌రు మేజ‌ర్ కూడా. వాళ్ల పేర్లు య‌త్రా రాజా, లింగ రాజా. ధ‌నుష్ త‌న భార్య ఐశ్వ‌ర్య నుంచి కొన్నేళ్ల ముందే విడిపోయిన‌ప్ప‌టికీ.. పిల్ల‌ల‌తో త‌న అనుబంధం కొన‌సాగుతోంది.

కొన్నేళ్లుగా ఇద్ద‌రు కొడుకులు ఎక్కువ‌గా తండ్రితోనే ఉంటున్నారు. ధ‌నుష్ సినిమా ఈవెంట్లకు కూడా వాళ్లిద్ద‌రూ హాజ‌ర‌వుతుంటారు. త‌న మ‌న‌వ‌ళ్లంటే ర‌జినీకాంత్‌కు ఎంతో ఇష్టం. ఇక ధ‌నుష్ కొడుకుల‌కు తమ తండ్రి ప‌ట్ల ఎంత ప్రేమ ఉందో వాళ్లు ఏదైనా ఈవెంట్‌కు హాజ‌రైన‌పుడు క‌నిపిస్తూనే ఉంటుంది. తాజాగా ధ‌నుస్ యాత్ర‌, లింగాల‌తో క‌లిసి తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌యులిద్ద‌రూ తండ్రిని సంర‌క్షించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

తిరుమ‌ల‌కు సెల‌బ్రెటీలు వ‌స్తే వారిని చూడ్డానికి భ‌క్తులు కూడా ఎగ‌బ‌డ‌తార‌న్న సంగ‌తి తెలిసిందే. పైగా ధ‌నుష్ పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న న‌టుడు. దీంతో అత‌డిని చూడ్డానికి జ‌నం పెద్ద ఎత్తునే గుమిగూడారు. ధ‌నుష్ ద‌గ్గ‌రికి జ‌నం వ‌స్తార‌ని గ్ర‌హించి కొడుకులిద్ద‌రూ తండ్రి వెనుక బాడీ గార్డుల్లా నిల‌బ‌డ్డారు.

ధ‌నుష్ న‌డుస్తుంటే..జ‌నం వ‌చ్చి త‌న మీద ప‌డిపోకుండా ర‌క్ష‌ణ‌గా ఉన్నారు. జ‌నం పెరుగుతున్నా.. యాత్ర‌, లింగా తండ్రి వెంటే ఉండి అత‌ణ్ని సంర‌క్షించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.. ధ‌నుష్ మీద కొడుకులిద్ద‌రికీ ఎంత ప్రేమ‌.. టీనేజీలోనే ఎంత‌గా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటూ వారి మీద ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు నెటిజ‌న్లు.

యాత్ర‌, లింగా ప్ర‌స్తుతం చ‌దువు మీదే దృష్టిపెట్టారు. భ‌విష్య‌త్తులో ఈ ఇద్ద‌రూ తండ్రి బాట‌లో సినీరంగ ప్ర‌వేశం చేసే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. త‌ల్లి, తాత వైపు నుంచి వారికి ఫుల్ స‌పోర్ట్ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ధ‌నుష్ విష‌యానికి వ‌స్తే గ‌త ఏడాది ఇడ్లీ కొట్టు, తేరే ఇష్క్ మే చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాలు అందుకు్నాడు. ప్ర‌స్తుతం అత‌ను రెండు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అత‌డి మాజీ భార్య ఐశ్వ‌ర్య ద‌ర్శ‌కురాలిగా 3, వై రాజా వై, లాల్ స‌లామ్ చిత్రాలు డైరెక్ట్ చేసింది.