అస్సలు తగ్గనంటున్న గుణశేఖర్

సీనియర్ దర్శకుడు గుణశేఖర్‌ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన హవా తగ్గుతున్న టైంలో ‘రుద్రమదేవి’ లాంటి భారీ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో నిర్మించడం కెరీర్లోనే అతి పెద్ద సాహసం. ఆ సినిమా అటు ఇటు అయితే ఆయన కెరీర్ ముగిసిపోయేది కానీ.. ఎలాగోలా గట్టెక్కేశారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయనకు కలిసి రావడం లేదు.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీయాలనుకున్న ‘హిరణ్య కశ్యప’ అటకెక్కేసింది. మరో పీరియడ్ మూవీ ‘శాకుంతలం’ చేదు అనుభవాన్ని మిగిల్చింది. తర్వాత ‘యుఫోరియా’ అనే యూత్ ఫుల్, సందేశాత్మక చిత్రం తీస్తే దానికీ ఆశించిన స్పందన రాలేదు. సమాజానికి అవసరమైన సినిమానే తీసినప్పటికీ.. కొన్ని లోటు పాట్ల వల్ల, రిలీజ్ టైమింగ్ సరిగా లేకపోవడం వల్ల ‘యుఫోరియా’ థియేటర్లలో సరిగా ఆడలేదు.

ఐతే ఈటీవీ విన్ ద్వారా డిజిటల్‌గా రిలీజయ్యాక ‘యుఫోరియా’కు వచ్చిన స్పందన తనలో కొత్త ఉత్సాహం తెచ్చిందని అంటున్నారు గుణశేఖర్. ఈ సినిమాను థియేటర్లలో చూడనందుకు సిగ్గుపడుతున్నామంటూ చాలామంది మెసేజ్‌లు కూడా చేశారని గుణశేఖర్ వెల్లడించారు.

రిలీజ్ టైమింగ్ బాలేకపోవడం, పబ్లిసిటీ సరిగా చేయకపోవడం వల్లే ‘యుఫోరియా’ థియేటర్లలో సరిగా ఆడలేదని ఆయనన్నారు. కానీ తన కెరీర్లో మరే చిత్రానికీ ఈ స్థాయిలో ప్రశంసలు మాత్రం రాలేదన్నారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూశాక ఉత్సాహంగా నాలుగు కథలు రెడీ చేసినట్లు ఆయన తెలిపారు. అందులో పెద్ద బడ్జెట్లో తెరకెక్కే ఒక పీరియడ్ మూవీ కూడా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

అంతకంటే ముందు ఒక యువ కథానాయకుడితో దసరాకు తన కొత్త సినిమాను మొదలుపెడతానని చెప్పారు. ‘హిరణ్య కశ్యప’ తన చేతుల్లోంచి వెళ్లిపోవడం గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా కోసం ఏడెనిమిదేళ్లు సమయం వృథా అయిందని అన్నారు.

కానీ ఈ సినిమా కోసం పరిశోధన జరిపే సమయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని.. ఆ ప్రాజెక్టును వదిలేసినప్పటికీ, దానికి రిలేటెడ్‌గా కొత్త ఆలోచన వచ్చిందని, ప్రస్తుతం దాని మీద పని చేస్తున్నానని గుణశేఖర్ వెల్లడించారు. స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రాలు వరుసగా బోల్తా కొడుతున్నా.. గుణశేఖర్ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఒక భారీ పీరియడ్ మూవీ సహానాలుగు కథలు రెడీ చేయడం, స్వీయ నిర్మాణంలో ఇంకో సినిమా చేయడానికి సిద్ధం కావడం విశేషమే.