మాటలు లేకుండా సినిమాను ఊహించుకోవడం కష్టం. డైలాగులు పెట్టకుండా కేవలం సీన్స్ తో కన్విన్స్ చేయడం అసాధ్యం కాబట్టి దర్శక నిర్మాతలు వీటికి దూరంగా ఉంటారు. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం సింగీతం శ్రీనివాసరావు గారు కమల్ హాసన్, అమల, టిను ఆనంద్ తో చేసిన పుష్పక విమానం ఎప్పటికీ చెప్పుకునే క్లాసిక్ గా నిలిచిపోయింది.
భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఆడియన్స్ ని మెప్పించడం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ తర్వాత ఎవరూ ఈ ప్రయోగం చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత గాంధీ టాక్స్ రూపంలో మూవీ లవర్స్ కోరిక నెరవేరుతోంది. ఒక సైలెంట్ మూవీ రాబోతోంది.
ట్రైలర్ లోనే కథేంటో చెప్పగలిగిన దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్ నైపుణ్యాన్ని మెచ్చుకోవాలి. తల్లిని ప్రాణంగా చూసుకునే మధ్య తరగతి యువకుడు (విజయ్ సేతుపతి) డబ్బు కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎదురింట్లో ఉండే అందమైన అమ్మాయి (అదితి రావు హైదరి) ని ఇష్టపడి ప్రేమిస్తాడు.
ఇంకో వైపు కోట్లలో మునిగితేలే బడా వ్యాపారవేత్త (అరవింద్ స్వామి). విమాన ప్రమాదంలో కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు. వీళిద్దరిని మనీ క్రైమ్ ఒకటి లింకు పెడుతుంది. యుద్ధం మొదలవుతుంది. మనుగడ కోసం పరుగులు పెడతారు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో తెలియాలంటే జనవరి 30 దాకా ఆగాలి.
కేవలం సౌండ్ తోనే ఇంత క్వాలిటీ విజువల్స్ ద్వారా కంటెంట్ ని ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జీవం పోసిందని చెప్పాలి. పెద్దగా అంచనాలు లేకుండా చూసినా ఆసక్తి రేపేలా చేయడంలో టీమ్ సక్సెస్ అయ్యింది.
కమర్షియల్ రేంజ్ ఏంటో రిలీజయ్యాక తేలుతుంది కానీ గాంధీ టాక్స్ మాత్రం ఎన్నో ప్రశంసలు, అవార్డులకు అర్హత సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిల పోటాపోటీ నటన మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. సంక్రాంతి హడావిడి అయిపోయింది కాబట్టి గాంధీ టాక్స్ కనక మెప్పిస్తే కొత్త జానర్ కు తలుపులు తీసినట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates