తెర మీద రొమాంటిక్ సీన్లు చూడడం మెజారిటీ ప్రేక్షకులకు బాగానే ఉంటుంది కానీ.. అవి చేయడం మాత్రం నటీనటులకు చాలా ఇబ్బంది కలిగించే విషయమే. తెర మీద హీరో హీరోయిన్లు మాత్రమే కనిపిస్తారు కానీ.. సెట్లో పదులు, వందల సంఖ్యలో కాస్ట్ అండ్ క్రూ ఉంటారు. వారి మధ్య రొమాన్స్ పండించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.
మళ్లీ మళ్లీ టేక్స్ చేయాలంటే ఏదోలా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకే ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఐతే హీరోయిన్ ఓకే అన్నా కూడా దర్శకుడే ఈ సీన్లు తీయడానికి బాగా ఇబ్బంది పడడం గురించి ఎక్కడైనా విన్నామా? తమ సెట్లో అదే జరిగింది అంటోంది ఫంకీ మూవీ హీరోయిన్ కాయదు లోహర్.
ఫంకీలో కాయదు విశ్వక్సేన్‌కు జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో విశ్వక్‌తో కాయదుకు రొమాంటిక్ సీన్లు ఉన్నాయట.
విశ్వక్, కాయదులతో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఆ సీన్ల గురించి మాట్లాడాడు అనుదీప్. రొమాంటిక్ సీన్లు చేయనని కాయదు మొండికేసిందంటూ అనుదీప్ సరదాగా వ్యాఖ్యానించగా.. తన మాటల్ని విశ్వక్ హిందీలోకి అనువదించి చెప్పాడు విశ్వక్.
దీంతో ఆశ్చర్యపోయిన కాయదు.. రొమాంటిక్ సీన్లు చేయడంలో తనకేమీ ఇబ్బంది లేదని.. అనుదీపే వాటిని చేయడానికి తడబడ్డాడని వెల్లడించింది. ఆ సీన్లు తీసేటపుడే పదే పదే అనుదీప్ కట్ కట్ అనేవాడని.. ఆర్టిస్టులకంటే దర్శకుడే అవి చేయడానికి ఇబ్బంది పడ్డాడని చెప్పింది. దీంతో హీరోయిన్‌కు లేని ఇబ్బంది దర్శకుడికేంటా అని ఈ వీడియో చూసిన వాళ్లందరూ ఆశ్చర్యపోతున్నారు.
జాతిరత్నాలుతో సెన్సేషన్ క్రియేట్ చేశాక.. ప్రిన్స్ మూవీతో నిరాశపరిచాడు అనుదీప్. ఆ తర్వాత అతను రవితేజతో ఓ సినిమా కోసం ప్రయత్నించాడు. అది వర్కవుట్ కాలేదు. ఆపై సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో విశ్వక్, కాయదు కలయికలో ఫంకీ తీశాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates