బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు జవాన్, పఠాన్, డంకీ ఇచ్చిన షారుఖ్ ఖాన్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఏడాదికి పైగా అభిమానులకు దర్శనం ఇవ్వలేదు. తన కొత్త మూవీ కింగ్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. గత ఏడాది జరిగిన చికిత్స వల్ల విశ్రాంతి తీసుకున్న షారుఖ్ తాజాగా కింగ్ విడుదల తేదీని ఖరారు చేశాడు.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 విడుదలవుతుందని కొత్త టీజర్ తో అధికారికంగా ప్రకటించింది రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ. ఇందులో షారుఖ్ కూతురు సుహానా ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కింగ్ కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన లీక్ ముంబై వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
1994లో ‘లియోన్ ది ప్రొఫెషనల్’ అనే హాలీవుడ్ మూవీ వచ్చింది. పెద్ద హిట్టు. స్టోరీ ఏంటంటే హీరో కాంట్రాక్ట్ కిల్లర్. డబ్బులు తీసుకుని ఎన్ని పనులు చేసినా స్వతహాగా మంచివాడు, సున్నిత మనస్కుడు. ఇతని ఇంటి పక్కనే ఒక టీనేజ్ అమ్మాయి తండ్రిని డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడనే కారణంతో ఒక పోలీస్ ఆఫీసర్ అతని కుటుంబాన్ని దారుణంగా చంపేస్తాడు.
బయటికి వెళ్లి ఉండటంతో ఆ అమ్మాయి తప్పించుకుంటుంది. ప్రాణ భయంతో హీరో చెంతకు చేరుతుంది. తమ్ముడిని హత్య చేసిన వాళ్ళ మీద ప్రతీకారం కోసం సహాయం కోరుతుంది. తండ్రి కూతురిలా ఇద్దరి మధ్య బంధం ఏర్పడుతుంది. అసలు ప్రమాదాలు తర్వాత మొదలవుతాయి.
దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఇప్పుడీ కింగ్ కోసం లియోన్ ది ప్రొఫెషనల్ నే స్ఫూర్తిగా తీసుకున్నాడట. అధికారికంగా చెప్పలేదు కానీ సోర్స్ అయితే బలంగానే ఉంది. ఎంతవరకు నిజమో ట్రైలర్ వస్తే కానీ చెప్పలేం. షారుఖ్, సుహానా మధ్య ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయని, సినిమాకు ఇవే హైలైట్ కాబోతున్నాయని టీమ్ నుంచి వినిపిస్తున్న సమాచారం.
సుహానాకు బ్రేక్ దక్కాలనే ఉద్దేశంతో షారుఖ్ ఈ ప్రాజెక్ట్ మీద భారీ పెట్టుబడి పెట్టాడు. ప్రొడక్షన్, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కించేలా చూసుకుంటున్నాడు. డిసెంబర్ ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి అభిమానులు అప్పటిదాకా రిలాక్స్ అవ్వొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates