మరో క్రికెటర్ బయోపిక్ వస్తోందహో…

భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది గొప్ప కెప్టెన్లు ఉన్నారు. కానీ ఆ అందరిలో భారత క్రికెట్‌ను అత్యంత గొప్ప మలుపు తిప్పిన సారథి ఎవరు అంటే మాత్రం సౌరభ్ గంగూలీ పేరే చెప్పాలి. విజయాల శాతం పరంగా చూసినా.. అత్యధిక ఐసీసీ టైటిళ్ల లెక్క తీసినా ధోనీనే మేటి కెప్టెన్ అనడంలో సందేహం లేదు.

కానీ 2000 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో కుదేలైన జట్టును గాడిన పెట్టి, మళ్లీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపి.. ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా టీమ్ ఇండియాను నిలబెట్టి.. ఆస్ట్రేలియా లాంటి భీకర జట్లతో కూడా ఢీ అంటే ఢీ అని తలపడేలా చేసిన ఘనత మాత్రం గంగూలీదే.

అప్పటిదాకా భయం భయంగా ఆడే జట్టులో ఆత్మవిశ్వాసం పెంచి, దూకుడుగా ఆడేలా చేసింది ఈ కలకత్తా రాకుమారుడే. ఆయన బయోపిక్ గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది.

‘ప్యార్ కా పంచ్‌నామా’, ‘సోనూ కే టిటు కి స్వీటీ’, ‘దే దే ప్యార్ దే’ ‘తూ జూతీ మే మక్కర్’ లాంటి ప్రేమకథా చిత్రాలతో మెప్పించిన లవ్ రంజన్.. గంగూలీ బయోపిక్ తీయబోతున్నాడు. ఈ సినిమాను అతను అధికారికంగా ప్రకటించాడు. విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించిన రాజ్ కుమార్ రావు.. గంగూలీ పాత్రలో కనిపించబోతున్నాడు.

కొన్ని నెలలుగా కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకోకుండా గంగూలీ పాత్రకు తగ్గట్లుగా మేకోవర్ అవుతున్నాడు రాజ్ కుమార్. స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు చేసిన టీం.. ఇక షూటింగ్‌కు వెళ్లడమే తరువాయి. స్పోర్ట్స్ బయోపిక్స్‌లో ధోని సినిమాను ది బెస్ట్‌గా చెప్పొచ్చు. మిల్కా సింగ్ బయోపిక్ సైతం గొప్ప పేరు తెచ్చుకుంది. వీటిని మ్యాచ్ చేసే స్థాయిలో గంగూలీ బయోపిక్‌‌ను కూడా తీస్తే గొప్ప ఆదరణ దక్కడం ఖాయం. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.