150 కోట్లు కొట్టి… ఇప్పుడు బోల్తా కొట్టాడు

గత ఏడాది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో తెలిసిందే. ఏడాది ఆరంఢంలో ‘ఎల్-2: ఎంపురాన్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడాయన. ఆ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ‘తుడరుమ్’ సినిమాతో మరో రికార్డ్ బ్రేకింగ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆపై ‘హృదయపూర్వం’ చిత్రంతోనూ సక్సెస్ సాధించాడు లాల్. అలాంటి టాప్ స్టార్.. ఏడాది చివర్లో బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడు.

లాల్ నుంచి వచ్చిన ‘వృషభ’ ఫుల్ రన్లో రూ.2 కోట్ల వసూళ్లు కూడా సాధించలేకపోయింది. దారుణమైన ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ సినిమా.. బ్యాడ్ టాక్ తెచ్చుకుని వీకెండ్లోనే బాక్సాఫీస్ నుంచి వాషౌట్ అయిపోయింది. అప్పుడు వృషభ మీద స్పష్టమైన ఆధిక్యం సంపాదించిన చిత్రం.. సర్వం మాయ.

ఇది చాలా ఏళ్లుగా హిట్టు లేక ఇబ్బంది పడుతున్న నివిన్ పౌలీకి గొప్ప ఉపశమనాన్ని అందించిన సినిమా. ఆ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది. నివిన్ కెరీర్లోనే అతి పెద్ద హిట్ అది. అలాంటి విజయాన్నందుకున్న హీరో ఇప్పుడు మోహన్ లాల్ లాగే ఊహించని పతనం చవిచూశాడు.

నివిన్ హీరోగా తెరకెక్కిన ‘బేబీ గర్ల్’ అనే కొత్త సినిమా తాజాగా థియేటర్లలోకి దిగింది. ఈ థ్రిల్లర్ మూవీని మలయాళ ప్రేక్షకులు పట్టించుకోలేదు. తొలి రోజు ఈ చిత్రానికి కోటి రూపాయల వసూళ్లు రావడం కూడా కష్టంగా మారింది.

సినిమాకు ముందు నుంచే బజ్ లేకపోవడం, టాక్ కూడా బాలేకపోవడంతో ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. వీకెండ్లోనే సినిమా చతికిలపడేలా కనిపిస్తోంది. సరిగ్గా మోహన్ లాల్ అనుభవాన్నే నివిన్ ఎదుర్కొంటున్నాడు. ఎంత పెద్ద స్టార్ ఉన్నప్పటికీ.. కంటెంట్ ఆసక్తికరంగా లేకపోతే, బజ్ క్రియేట్ చేయలేకపోతే ప్రేక్షకులు పట్టించుకోరనడానికి ఇది రుజువు.