మ‌మ్ముట్టి… ఇక్క‌డ యాత్ర‌… అక్క‌డ పాద‌యాత్ర‌

మ‌ల‌యాళ లెజెండ‌రీ న‌టుడు మ‌మ్ముట్టి తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగానే ప‌రిచ‌యం. 90వ ద‌శ‌కంలోనే ఆయ‌న స్వాతికిర‌ణం లాంటి క‌ల్ట్ మూవీలో న‌టించి తెలుగు ఆడియ‌న్సుని మైమ‌రిపించారు. త‌మిళ అనువాదం ద‌ళ‌ప‌తితోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌పై బ‌ల‌మైన ముద్ర వేశారు. ఇక కొత్త త‌రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆయ‌న ప‌రిచ‌య‌మైంది యాత్ర సినిమా ద్వారా.

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాపై రాజ‌కీయంగా భిన్నాభిప్రాయాలున్న‌ప్ప‌టికీ.. వైఎస్ పాత్ర‌కు మ‌మ్ముట్టి పూర్తి న్యాయం చేశార‌న‌డంలో సందేహం లేదు. యాత్ర‌-2లోనూ ఆయ‌న కొన్ని స‌న్నివేశాల్లో మెరిశారు. విశేషం ఏంటంటే.. ఇప్పుడు మమ్ముట్టి మ‌ల‌యాళంలో పాద‌యాత్ర పేరుతో ఇంకో సినిమా చేస్తుండ‌డం విశేషం. తెలుగులో చేసిన యాత్ర‌కు, దీనికి ఏం సంబంధం లేక‌పోయి ఉండొచ్చు. కానీ పాద‌యాత్ర అని టైటిల్ పెట్టుకోవ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల దృష్టి ఆ సినిమాపై ప‌డింది.

ఈ మ‌ధ్యే క‌లంక‌వ‌ల్ అనే సినిమాతో త‌న అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కుల‌కు పెద్ద షాకే ఇచ్చారు మ‌మ్ముట్టి.. మ‌ల‌యాళ సినీ చరిత్ర‌లోనే అతి పెద్ద స్టార్ల‌లో ఒక‌డైన మ‌మ్ముట్టి.. ఇందులో సైకో కిల్ల‌ర్‌గా విల‌న్ పాత్ర‌ను పోషించాడు. ఆ సినిమాను త‌న‌ సొంత బేన‌ర్ మ‌మ్ముట్టి కంపెనీలో నిర్మించ‌డం విశేషం. ఇప్పుడు పాద‌యాత్ర‌ను సైతం ఆ బేన‌ర్లోనే చేయ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకో పెద్ద విశేషం ఏంటంటే.. దీన్ని లెజెండ‌రీ డైరెక్ట‌ర్ ఆదూర్ గోపాల‌కృష్ణ‌న్ రూపొందించ‌నున్నాడు.

మ‌మ్మ‌ట్టితో 32 ఏళ్ల కింద‌ట ఆయ‌న విధేయ‌న్ అనే క్లాసిక్ తీశారు. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత వీరి క‌ల‌యిక‌లో సినిమా రానుండ‌డంతో అంద‌రూ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. చాలా ఏళ్లుగా సినిమాలు చేయ‌ని ఆదూర్.. వ‌య‌సు ప్ర‌భావం రీత్యా ఇక డైరెక్ట్ చేయ‌ర‌నే అంతా అనుకున్నారు. కానీ 84 ఏళ్ల వ‌య‌సులో ఈ దిగ్ద‌ర్శ‌కుడు మ‌మ్ముట్టితో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. బ‌హుశా మ‌రో గొప్ప సినిమా తీసి రిటైర‌వ్వాల‌ని అనుకుంటున్నారేమో. మ‌రి మ‌మ్ముట్టితో ఈసారి ఆయ‌న ఎలాంటి క‌ళాఖండాన్ని తీస్తారో చూడాలి.